బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (15:39 IST)

గ్రేట్ పోలీస్.. ఆరు కిలోమీటర్లు భక్తురాలిని వీపుపై మోస్తూ తిరుమలకు...

రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి ఆకేపాడు నుంచి తిరుమలకు అన్నమయ్య మార్గంలో ఇటీవల మహా పాదయాత్ర జరిపిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న నందలూరుకు చెందిన 60 ఏళ్ల నాగేశ్వరమ్మ ఈ నెల 23వ తేదీ అటవీ ప్రాంతంలో అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపోయారు. పాదయాత్ర భద్రత డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ షేక్ ఆర్షద్... ఆమెను తన వీపు మీద వేసుకుని 6 కిలోమీటర్ల దూరం తిరుమలకు మోసుకొచ్చి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. కానిస్టేబుల్ సేవను అందరూ అభినందిస్తున్నారు.
 
''60 సంవత్సరాల మహిళను ఆరు కిలోమీటర్ల దూరం అడవి ద్వారా తిరుమలకు మోసుకొచ్చావు. భక్తురాలికి నీవు చేసిన సేవ అభినందనీయం. నీ సేవలను గుర్తించాలని డిజిపికి చెబుతాను'' అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కడప స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఆర్షద్‌ను అభినందించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారే నాకు ఆ శక్తి ఇచ్చారని కానిస్టేబుల్ సమాధానం ఇచ్చారు. మీ లాంటి వారి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు. 
 
ఇదిలావుండగా... తిరుమలకు వెళ్ళే నడక దారుల్లో భక్తులకు అత్యవసర వైద్య సేవలు మెరుగు పరచాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. జెన్కో ఎమ్‌డి శ్రీధర్ నడకదారిలో గుండెపోటు వచ్చి స్విమ్స్‌లో చేరడం, అన్నమయ్య మార్గంలో నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురై కానిస్టేబుల్ తిరుమలకు మోసుకుని వచ్చిన సంఘటనల నేపథ్యంలో తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారుల్లో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాలు, అందులో ఉన్న సిబ్బంది, అందుబాటులో ఉన్న మందులు ఇతర విషయాల గురించి వివరాలు తెలుసుకున్నారు. నడక దారిలో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసరంగా వైద్యం అవసరమైతే ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వివరాలు వెంటనే సంబంధింత ఆసుపత్రికి అందించడానికి వైర్లెస్ సెట్లు కూడా ఏర్పాటు చేయాలని చైర్మన్ ఆదేశించారు. జెఈవో బసంత్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద ఇతర అధికారులు పాల్గొన్నారు.