పెళ్లి పీటలపై కూర్చుని పోలీసుల కోసం 100కి డయల్ చేసిన వధువు, ఎందుకు?
ఓ వధువు పెళ్లి పీటల మీద కూర్చుని పోలీసుల కోసం 100కి డయల్ చేసింది. దాంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. అసలు వధువు పెళ్లి పీటల పైనుంచి ఇలా పోలీసులకు ఎందుకు ఫోన్ చేసింది?
వివరాల్లోకి వెళితే... గురువారం నాడు మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్యతో వివాహాన్ని పెద్దల సమక్షంలో చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వధూవరులు పెళ్లిపీటలపై కూర్చున్నారు. ఐతే అకస్మాత్తుగా వధువు తన సెల్ ఫోను నుంచి పోలీసుల కోసం 100కి డయల్ చేసింది. దాంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పీటల పైనుంచి లేచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ, తను ప్రేమించిన యువకుడిని పెళ్లాడుతానంటే పెద్దల అంగీకరించలేదనీ, తను ఈ పెళ్లి చేసుకోనని తెలిపింది. దీనితో పోలీసులు కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను వివాహం చేసుకునేందుకు పెద్దలు అడ్డు చెప్పరాదని కోరారు. శుక్రవారం నాడు మండలంలోని జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.