శ్రీవారి దర్శనానికి వెళ్తూ అస్వస్థతకు గురైన భక్తురాలు.. 6కిలో మీటర్లు మోసుకెళ్లిన కానిస్టేబుల్!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ అస్వస్థతకు గురైన భక్తురాలికి ఓ కానిస్టేబుల్ సాయం చేశారు. ఆమెను తన వీపుపై ఎక్కించుకొని ఆరు కిలోమీటర్లు కొండ మార్గంలో మోసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడారు. తిరుమల వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ఈ సన్నివేశం కనిపించింది. అంతేకాదు శ్రీవారి భక్తురాలిని ఆదుకున్న కానిస్టేబుల్ ముస్లిం కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. మంగి నాగేశ్వరమ్మ అనే 68 ఏళ్ల మహిళ తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గంలో వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, వాహనాలను వెళ్లలేని మార్గం కావడంతో.. ఆమె చాలా సేపు అక్కడే ఉండిపోయింది.
చుట్టు పక్కల చాలా మంది భక్తులు ఉన్నా ఆమెను ఆదుకోలేని పరిస్థితి. అంతలోనే సాక్షాత్తు శ్రీనివాసుడే పంపించాడా..అన్నట్లుగా అక్కడికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అర్షద్ చేరుకున్నాడు. ఆ భక్తురాలి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయాడు. మరుక్షణం ఆలోచించకుండా ఆమెను వీపులపై ఎక్కించుకొని 6 కి.మీ. కాలినడకన మోసుకెళ్లారు. అనంతరం ఆస్పత్రిలో అడ్మిట్ చికిత్స అందజేశారు.
శ్రీవారి భక్తురాలిని కాపాడిన కానిస్టేబుల్ అర్షద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సరిలేరు మీకెవ్వరు అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన పనికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఫిదా అయ్యారు.