సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

టీనేజ్ లవ్ : ఫినాయిల్ తాగిన బాలిక... పురుగుల మందు తాగిన బాలుడు..

గుంటూరు జిల్లాలో టీనేజ్ లవ్ వికటించింది. తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసి గొడవ పడటంతో మనస్తాపం చెందిన మైనర్ ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ప్రియురాలి ప్రాణాపాయం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా మాచర్ల మండలం బీకే పాలేనికి చెందిన బాలుడు (17), బాలిక (16) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు గొడవ పడ్డారు. 
 
తమ వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయన్న మనస్తాపంతో బాలిక ఇంట్లోని ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం తెలుసుకున్న ప్రియుడు పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు. 
 
అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మరోవైపు, ఫినాయిల్ తాగిన బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.