12 ఏళ్లకే సాఫ్ట్వేర్ జాబ్ పొందిన బాలుడు, ఇదిలా సాధ్యం?
12 ఏళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి.. అభినందనలు అందుకుంటున్నాడో ఓ బాలుడు. అంతేకాదండోయ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రితోనే శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ఆ విద్యార్ధి పేరు శరత్. వారంలో మూడు రోజులు స్కూల్‌కి వెళ్లి పాఠాలు వింటాడు. మరో మూడు రోజులు సాఫ్ట్వేర్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రొత్సహించడంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాడు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.రాజ్ కుమార్ ప్రియ క్యాప్ జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్ స్ధానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో రోజు ల్యాప్‌టాప్‌లో పని చేయడాన్ని ఆ విద్యార్ధి చిన్నప్పటి నుంచి నిశితంగా గమనిస్తున్నాడు. దీంతో ఏడేళ్ల వయసులోనే అతనిలో కోడింగ్, జావా తదితర సాఫ్ట్వేర్‌లపై ఆసక్తి పెరగడంతో వాటిని నేర్చుకున్నాడు.
అతడిలోని టాలెంట్‌ని గమనించిన తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికి వస్తాడని గమనించారు. శరత్‌ని ప్రొత్సహించారు. పలు ఐటీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఇంటర్వ్యూలకి వెళ్లాడు. ఇటీవల మాంటైగ్నే సంస్థలో నెలకు 25 వేల గౌరవ వేతనంతో శరత్‌కు డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కింది. దాంతో పాటుగా కొన్ని రోజులు ఉద్యోగం కొన్ని రోజులు చదువుకునేందుకు అవకాశం కల్పించారు. 12 ఏళ్ల వయసులో ఏడవ తరగతి చదువుతూ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కించుకున్న శరత్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శభాష్... శరత్. పిల్లలు ఏ రంగంలో ఆసక్తి కనపరుస్తున్నారో అందులో ప్రొత్సహిస్తే.. సంచలనాలు సృష్టిస్తారు అనడానికి ఇదే నిదర్శనం.