శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (11:21 IST)

ఏడు నెలల పసికందుపై పైశాచికత్వం... ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడు నెలల పాపపై ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు కనిపించాయి. రాత్రివేళ ఊయలలో హాయిగా నిద్రపోతున్న పసిపాపను ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ముళ్లపొదల్లో పడేసి పారిపోయారు. ఆ చిన్నారి పెదాలు, మర్మావయవాల వద్ద గాయాలున్నాయి. దీంతో పసికందుపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో మంగళవారం ఈ సంఘటన వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7 నెలల పసికందును ఊయలలో నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారే సరికి లేచి చూస్తే పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి కుటుంబసభ్యులతో కలిసి పాప కోసం చుట్టుపక్కల గాలించింది. 
 
వారి ఇంటికి కొద్ది దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డేనని గుర్తించింది. చిన్నారి ఒంటిపైనున్న గాయాలు చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. కుటుంబసభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. పాప పెదాలు, మర్మావయాలపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు.
 
అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. సమాచారం అందుకున్న  స్థానిక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానితులను ప్రశ్నించారు. 
 
మరోవైపు తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ ఉంటారని చిన్నారి తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పసికందును జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి చూసి తల్లిని పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఏడు నెలల పాపపై జరిగిన ఈ అఘాయిత్యం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.