వైకాపా మాచర్ల ఎమ్మెల్యే కారుపై దాడి...

mla car attacked
ఠాగూర్| Last Updated: మంగళవారం, 7 జనవరి 2020 (14:29 IST)
అమరావతి రాజధాని కోసం గత 21 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, రాజధాని కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు గత 21 రోజులుగా రోడ్లపైకి వచ్చిన వివిధ రకాల నిరసనలు, ర్యాలీలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చినకాకాని వద్ద అధికార పార్టీ వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో భాగంగా చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు.

ఆ సమయంలో అటుగా మాచర్ల ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి కారు వచ్చింది. ఆ కారును ఆపేందుకు రైతులు ప్రయత్నించారు. కానీ, ఆయన ఆపకుండా ముందుకు సాగిపోయారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత పోలీసులు, గన్‌మెన్లు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే కారును ఆందోళనకారుల చెర నుంచి విడిపించడంతో వెళ్లిపోయారు.దీనిపై మరింత చదవండి :