ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (14:00 IST)

దత్తత తీసుకున్న బాలికను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

హైదరాబాదులో దారుణం జరిగింది. ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులు.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. 
 
బాలికతో వెట్టిచాకిరి చేయించారు. అంతేకాదు, నోటికి వచ్చినట్లుగా తిట్టటం, ఒళ్లు హూనం అయ్యేలా కొట్టడం, తాళ్లతో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. పాప పట్ల పెంపుడు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న తీరును స్థానికులు గమనించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో వారు కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైల్డ్ లేబర్ సహాయంతో పాపను కాపాడారు. ఒంటినిండా గాయాలతో వున్న చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఏడేళ్ల చిన్నారి పట్ల అంత్యంత కిరాతకంగా ప్రవర్తించిన పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.