మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (15:40 IST)

జగన్ పాలన ఎలా ఉందంటే... లగడపాటి రాజగోపాల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎందనే విషయం మూడేళ్ళ తర్వాతే తెలుస్తుందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కనిపించారు. విజయవాడలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు.
 
ఓటు వేసిన అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాలన ఎలా ఉందనే విషయం మూడేళ్ల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే జగన్ తో తనకు పరిచయం ఉందని చెప్పారు. 
 
రాజకీయ పార్టీల మధ్య పోటీ చాలా ఎక్కువైపోయిందని... అందుకే ఓటర్లకు ఆకట్టుకోవడానికి పార్టీలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. వైఎస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేవని చెప్పారు.
 
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానన్న మాటకు కట్టుబడే ఉన్నానని లగడపాటి చెప్పారు. రాజకీయా సర్వేలకు సైతం దూరంగా ఉన్నానని తెలిపారు. ఆలయాలపై దాడులు జరుగుతుండటానికి గల కారణాలను పోలీసులు, ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని చెప్పారు. 
 
గెలిచినా, ఓడినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను అట్టిపెట్టుకునే ఉన్నారని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైనా... స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగడం అభినందనీయమని కితాబిచ్చారు.
 
కాగా, రాష్ట్ర విభజన సమయంలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ హల్ చల్ చేసిన లగడపాటి... ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన సర్వేతో ప్రజలు ముందుకు వచ్చిన లగడపాటి... ఆ తర్వాత పూర్తి కనిపించకుండా పోయారు.