గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:38 IST)

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలోనూ, ఏపీలోనూ పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
 
ఉప‌రి‌తల ఆవ‌ర్తనం, ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీచేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది. 
 
ఒడిశా ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ప్రభావం ఉంటందని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 
ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. 
 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.