గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated: సోమవారం, 21 నవంబరు 2022 (14:32 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచివున్న వాయుగుండం ముప్పు

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచివుంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి ఆదివారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అదే రోజు రాత్రి చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
ఈ వాయుగుండం ప్రభావం కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. 
 
ఈ వాయుగుండం చెన్నై - నెల్లూరు ప్రాంతాల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాతీర ప్రాంతాలైన శ్రీహరికోట, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య వంటి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.