శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (15:40 IST)

బుగ్గనకు కౌంటర్ ఇచ్చిన హెరిటేజ్... విత్తమంత్రి సవాల్ స్వీకరిస్తారా?

రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పద్నాలుగు ఎకరాలు కొన్నదంటూ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. బుగ్గన చేసిన ఆరోపణలపై.. డాక్యుమెంట్ల వారీగా.. వివరణను మీడియాకు విడుదల చేసింది. మంత్రి బుగ్గన చెప్పినట్లుగా.. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూమి రాజధాని పరిధిలో లేదని స్పష్టంచేసింది. 
 
కంతేరు అనే గ్రామంలో హెరిటేజ్ భూమి కొనుగోలు చేసిందని.. రాజధాని భూసమీకరణ గ్రామాల్లో అది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. రాజధానికి.. కంతేరుకు 20 కిలోమీటర్ల దూరం ఉంటుందని వివరణ ఇచ్చింది. తాము భూములు కొనుగోలు చేసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారానికో.. సొంత ఆస్తుల కోసమో కాదని.. కేవలం ప్లాంట్ నిర్మాణం కోసమేనని హెరిటెజ్ సంస్థ స్పష్టం చేసింది. 
 
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పెరుగుతున్న మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి.. అక్కడి రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేందుకు.. తాము ఓ ప్లాంట్‌ను పెట్టాలని… 2014 మార్చిలోనే హెరిటేజ్ బోర్డు భూమి కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రెండు నెలల వ్యవధిలో మొవ్వా శ్రీలక్ష్మి అనే మహిళకు చెందిన 7.21 ఎకరాలు, చిగురుపాటి గిరిధర్‌కు చెందిన 2.46 ఎకరాలు, ఎఈపీఎల్ సంస్థకు చెందిన 4.55 ఎకరాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామన్నారు. 
 
అయితే.. ఎల్‌ఈపీఎల్‌కు చెందిన 4.55 ఎకరాలపై వివాదం ఉండటంతో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని… అక్కడ బుగ్గన చెప్పినట్లుగా 14 ఎకరాలు కొనుగోలు చేయలేదని.. కేవలం 9.67ఎకరాలను మాత్రమే కొనుగోలు చేసినట్లుగా హెరిటేజ్ తెలిపింది. రాజధాని ప్రకటన కంటే చాలా మందుగానే… ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల ఫలితాలు రాక ముందే కంతేరులో మిల్క్ ప్లాంట్ పెట్టడం కోసమే ఆ స్థలం కొన్నట్లు హెరిటేజ్ చెబుతోంది. 
 
అదేసమయంలో అనంతపురం, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నంలలో కూడా భూమి కొనుగోలు చేశామని స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం 2014 జూన్‌లో ఏర్పడిందని, డిసెంబర్‌లో రాజధానిని ప్రకటించారని హెరిటేజ్ తెలిపింది. హెరిటేజ్ సంస్థ పూర్తిగా న్యాయబద్దంగా వ్యవహరించిందని, కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడింది. 
 
మరోవైపు, ఏపీఎన్‌ఆర్టీ మాజీ అధ్యక్షులు వేమూరు రవికుమార్‌ కూడా తనపై బుగ్గన అసంబ్లీలో చేసిన ఆరోపణలను ఖండించారు. అమరావతి ప్రాంతంలో 15 ఏళ్ల క్రితమే ఆరు ఎకరాలు కొనుగోలు చేశానన్నారు. రాజధాని ప్రకటనకు ముందు సెంటు భూమి కూడా కొనలేదని స్పష్టం చేశారు. రాజధాని ప్రకటించిన మూడు నెలల తర్వాత 10 ఎకరాలు కొన్నానని.. ఇందులో ఆరు ఎకరాలు కోర్‌ కేపిటల్‌ వెలుపలే ఉన్నాయన్నారు. తన నా కుటుంబానికి అమరావతి ప్రాంతంలో ఉన్నది 16 ఎకరాలు మాత్రమేనని .. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశానని నిరూపిస్తే… ఆ భూములు ప్రభుత్వానికి ఉచితంగా రాసిస్తానని సవాల్ చేశారు. 
 
మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్ కూడా భూములు కొన్నారని బుగ్గన ఆరోపించారు. దీనిపై రావెల కూడా స్పందించారు. రాజధానిలో తనకు నాకు భూములు ఉన్నాయనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌‌గా అభివర్ణించారు. మైత్రి అనే సంస్థతో తకు సంబంధం ఉందని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నిరూపించకపోతే బుగ్గన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. బుగ్గన క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.