సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (13:28 IST)

బ్రిటన్ అవార్డు రేసులో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ

ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ బ్రిటన్ సంస్థ ఇచ్చే స్ట్రక్చరల్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయ్యింది. కేంద్ర తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు గుర్తుగా గుజరాత్‌లోని కెవాడియా టౌన్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 
 
182 మీటర్లు ఎత్తైనా ఈ విగ్రహాన్ని గత ఏడాది అక్టోబర్ 13న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. బ్రిటన్‌కు చెందిన ఇనిస్టిట్యూషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇచ్చే అవార్డుకు 49 నిర్మాణాలతోపాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ రేసులో ఉంది. నవంబర్ 15న అవార్డులు ప్రకటిస్తారు. 
 
స్టాట్యూ ఆఫ్ యూనిటీ చాలా బాగుందని, ఇలాంటి నిర్మాణాలు ఇంజనీర్లకు సవాళ్లని, డిజైనింగ్, సరైన మెటీరియల్‌ను వాడటం లాంటి అంశాలు కీలకమని బ్రిటన్ సంస్థకు చెందిన మార్టిన్ పావెల్ చెప్పారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఆర్కిటెక్ట్ రామ్ సుతార్ డిజైన్ చేశారు. 
 
ఎల్ అండ్ టీ సంస్థ దీన్ని నిర్మించింది. గతంలో స్ట్రక్చరల్ అవార్డుకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్, పారిస్ లోని పొంపిడౌ సెంటర్,  ఇంగ్లండ్ లోని సెవెర్న్ బ్రిడ్జి ఎంపికయ్యాయి. 52 ఏళ్లుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. 
 
స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ఏర్పాటుకు రూ.2,989 కోట్లు ఖర్చు చేశారు. రికార్డుస్థాయిలో 33 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. 
 
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి రెండింతలు ఎత్తైన ఈ విగ్రహ నిర్మాణానికి 70 వేల టన్నుల సిమెంటు, 18,500 టన్నుల ఇనుము, 1700 మెట్రిక్ టన్నుల కాంస్యం వాడారు.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినా.. 6.5 తీవ్రతతో భూకంపాలు వచ్చిన విగ్రహానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా నిర్మించారు.