తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల ఆలయ అలంకరణ కోసం తాము ఎన్నో అనుమతులు తీసుకుని లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారికి చేసిన పుష్పాలంకరణను చెరిపివేస్తారా అంటూ దాత సునీత ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. 3 నెలలకి ముందుగానే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని అధికారులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఇక్కడికి డబ్బు సంపాదించాలని రాలేదనీ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని అన్నారు. ఐదుగురు డిజైనర్లతో ఆలయ అలంకరణ కోసం శ్రమించామనీ, రూ. 25 లక్షలు పెట్టి సంప్రదాయ పుష్పాలను, రూ. 15 లక్షలు వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక అరుదైన పుష్పాలను తెప్పించి అలంకరణ చేసామన్నారు. కొండపైకి క్రేన్స్ రాకూడదని కేవలం ఓ కారణం చెప్పి అంత కష్టపడి చేసిన పనిని చెరిపివేస్తారా... ఇది చిన్న విషయమా... ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.