ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 16 ఫిబ్రవరి 2019 (20:35 IST)

సెల్ఫీలు తీసి బజారుపాల్జేస్తావా? భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య..?

సెల్ఫీ కాస్త ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. తన భార్య ప్రతిచోటా సెల్ఫీలు తీసుకుని సామాజిక మాథ్యమాల్లో పోస్టులు చేస్తోందంటూ భర్త ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయాడు. తరచూ సెల్ఫీ గొడవే వీరి మధ్య రావడంతో చివరకు చేసేది లేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లాలో సంఘటన జరిగింది. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన చంద్రజ్యోతి కుప్పం మండలంలోని గుడుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. రెండు నెలల క్రితం వి.కోటలోని డిసిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శరత్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. 
 
నెల రోజుల వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. అయితే గత నెలరోజులుగా చంద్రజ్యోతి పాఠశాలలో పిల్లలతో, తన స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలను ఫేస్ బుక్, వాట్సాప్‌లలో పోస్టులు చేస్తోంది. దాంతో పాటు ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ తీసుకోవడం చంద్రజ్యోతికి అలవాటుగా మారిపోయింది.
 
ఇది భర్తకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో భార్యను మందలించాడు. భర్త ఎంత చెప్పినా చంద్రజ్యోతి పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య నిన్న రాత్రి గొడవ తారాస్థాయికి చేరింది. ఇలా సెల్ఫీలు తీస్తూ పరువు తీస్తున్నావంటూ రాత్రి శరత్ కోపంతో తన స్వస్థలం శ్రీకాళహస్తికి వెళ్ళిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన చంద్రజ్యోతి ఇంటిలో ఫ్యాన్‌ను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చంద్రజ్యోతి మరణంతో ఆమె కుటుంబం విషాధంలో మునిగిపోయింది.