సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (13:51 IST)

వైసీపీ సీనియర్ నేతకు షాక్ : భర్తపై పోటీ చేస్తున్న భార్య..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మినీ మహాభారతాన్ని తలపిస్తోంది. విశాఖ జిల్లాలో ఓ పక్క తండ్రి మరియు ఆయన కుమార్తె ప్రత్యర్థులుగా పోటీ చేస్తుంటే, మరొక అసెంబ్లీ సెగ్మెంట్‌లో భార్యాభర్తలు బరిలో దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి బరిలో ఉండగా ఆయన సతీమణి కమల స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. 
 
నిన్నటితోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారి ఈ వివరాలను వెల్లడించారు. కొలుసు పార్థసారథికి ఫ్యాన్‌ గుర్తును కేటాయించగా కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. ఒకే నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.
 
పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, వైసీపీ నుంచి పార్థసారథి ఉండగా జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి లంకా కమలాకర్‌ రాజు పోటీలో ఉన్నారు.
 
కాగా పార్థసారథి, ఆయన భార్య కమల మాత్రమే కాకుండా కుమారుడు నితిన్ కృష్ణ కూడా నామినేషన్ వేసినా, స్క్రూటినీ సమయంలో తిరస్కరణకు గురైంది. లేదంటే, కుటుంబం మొత్తం పెనమలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉండేవాళ్లు.