వివేకాను హత్య చేసి ఆస్పత్రిలో చేరిన పరమేశ్వర్ రెడ్డి?
మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరోపేరు తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి పేరును అనుమానితుల పేర్ల జాబితాలో పోలీసులు చేర్చారు. ఓ భూవివాదం కేసులో వివేకాను పరమేశ్వర్ రెడ్డి బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్ల పరమేశ్వర్ రెడ్డే హత్య చేసి తిరుపతికి వెళ్లి ఆస్పత్రిలో చేరివుంటారని పోలీసులు భావిస్తున్నారు.
వివేకానద రెడ్డి హత్య కేసు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరుగనున్న సమయంలో జరిగిన ఈ హత్య కేసులోని మిస్టరీని చేధించడం ఇపుడు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వివేకాకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న పరమేశ్వర్ రెడ్డిని పేరు తెరపైకి వచ్చింది.
ఈయన వివేకా హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండాపోయారు. ఇపుడు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించారు. వివేకా హత్య గురించి అతడిని మీడియా ప్రశ్నించగా... తనకు అనారోగ్యంగా ఉండడంతో మొదట కడప సన్‌షైన్ ఆసుపత్రిలో చేరానని వెల్లడించాడు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ మూడు రోజులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం తాను తిరుపతికి వచ్చి చేరినట్టు చెప్పారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని చెప్పిన పరమేశ్వర్ రెడ్డి.... పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, పరమేశ్వర్ రెడ్డి గతచరిత్ర చూస్తే ఆయనపై పలు హత్యకేసులు ఉన్నాయి.