వివేకానంద రెడ్డిది హత్యేనని తేల్చిన ఫోరెన్సిక్... దారుణంగా హతమార్చారు...

ys viveka
Last Modified శుక్రవారం, 15 మార్చి 2019 (16:13 IST)
వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడించింది. ఆయనను ఎవరో అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆయన శరీరంపై వున్న గాయాలను పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. కాగా తన ఇంటిలోని బాత్రూమ్‌లోపడి చనిపోయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా... నిజాలను నిగ్గు తేల్చేందుకు వీలుగా ఆయన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

మరోవైపు, వివేకా మృతిని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, అదనపు ఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. మృతి వెనుక ఎవరి పాత్ర ఉన్నట్టు తెలిసినా... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు, వైఎస్. వివేకా మృతిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, తమమకెంతో ముఖ్యుడైన వివేకా మృతి చెందిన ప్రాంతంలో రక్తపు మడుగులు కనిపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులమంతా దీనిపై లోతైన దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాగా వివేకానంద రెడ్డిది హత్యేనని తేలడంతో నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.దీనిపై మరింత చదవండి :