ఏపీలో కూటమి ఎలా గెలిచిందో అర్థం కావడంలేదు, జగన్ అలాంటివారు కాదు: ఆరా మస్తాన్ (video)
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఎలా విజయం సాధించిందో, ఎలా అధికారాన్ని హస్తగతం చేసుకున్నదో తమకు అర్థం కావడంలేదన్నారు ఆరా మస్తాన్. అందుకే అసలు ఏం జరిగిందన్న దానిపై పోస్టుమార్టం చేస్తున్నట్లు తెలిపారు. తాము సర్వే చేపట్టిన సమయంలో ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ఓటర్లు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబితే ఆ పథకాలు రావేమోనన్న భయంతో అసలు నిజం చెప్పలేదేమోనన్న అనుమానం కలుగుతోందని సందేహం వెలిబుచ్చారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే పనిలో వున్నట్లు చెప్పారు.
జాఫర్ షరీఫ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా... జగన్ గారు మిమ్మల్ని సంప్రదించారా అనే ప్రశ్నకు ఆరా మస్తాన్ చెబుతూ... ఇన్నేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారితో ప్రత్యక్షంగా ఏనాడూ కలుసుకోలేదని అన్నారు. ఆయనతో అసలు మాట్లాడిందే లేదని చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంత వరకూ జగన్ గారు అలాంటి వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు. అలాంటివారే అయితే రఘురామరాజు, బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు వంటి బడా నాయకులను ఎలా వదులుకుంటారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి భారీ విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. ఎగ్జిట్ పోల్ వివరాల్లో కూటమి పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూస్తాయని ఆరా మస్తాన్ పేర్కొంది. కానీ వారి అంచనాకు భిన్నంగా వైసిపికి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ఆరా మస్తాన్ షాక్ తినింది.