గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (13:52 IST)

జగన్ ముఖ్యమంత్రికి అర్హుడైతే.. పిల్ వేసేందుకు నాకు అర్హత లేదా : వైకాపా రెబెల్ ఎంపీ

raghurama krishnamraju
తన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు తాను అనర్హుడనని ఏపీ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టులో ప్రస్తావించారు. దీనిపై రఘురామ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జగన్‌పై సీబీఐ రూ.43 వేల కోట్ల ఆర్థిక నేరాలు అభియోగాలను నమోదు చేసిందన్నారు. కోర్టుకు హాజరుకాకుండా జగన్ తప్పించుకుని దొంగాలా తిరుగుతున్నారని విమర్శించారు. 
 
తాను వైకాపా ఎంపీనని తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చినట్టు శ్రీరామ్ అన్నారని, ఇది మరింత ఆశ్చర్యక్రరంగా ఉందన్నారు. తనను ఇంకా వైకాపా నుంచి సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. వైకాపా నుంచి తనను బహిష్కరించాలని తొలుత జగన్‌కు సలహా ఇవ్వాలని, ఆ పని చేస్తే సాధారణ ఎంపీగా ధృవీకరణ పత్రాన్ని సర్పిస్తానని చెప్పారు. తనను లాకప్‌లో వేసి చిత్రహింసలకు గురి చేశారని అన్నారు అయినా తన మిత్రుడి కొడుకైన జగన్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. 
 
ఇదిలావుంటే, ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతుందంటూ, సంక్షేమ పథకాల మాటున ఈ ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ రఘురామ హైకోర్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సీఎం జగన్, ఆయన మంత్రులు, అధికారులతో సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.