సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (09:46 IST)

ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు - నెల్లూరుకు 1400 కిమీ దూరంలో

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు తుఫాను ముప్పు ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ప్రస్తుతం దక్షిణ థాయిలాండ్ వద్ద అండమాన్‌కు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడివుంది. ఇది క్రమంగా ఏపీ, ఒడిశా తీరం వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నెల్లూరుకు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వెల్లడించింది. ఇది గురువారానికి వాయిగుండంగా మారి, ఈ నెల 3వ తేదీన తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఆ తర్వాత అది వాయువ్యంగా ప్రయాణించి నాలుగో తేదీ ఉదయం ఒడిశా తీరానికి చేరుకోవచ్చని అంచనాచ వేశారు. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో సముద్రపు గాలులు వీస్తాయని  పేర్కొంది. ఈ వాయుగుండం తుఫానుగా మారితే దీనికి 'జవాద్' అనే పేరుపెట్టే అవకాశం ఉంది. 
 
ఈ వాయుగుండం ప్రభావం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో గురువారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
అలాగే, 5, 6 తేదీల్లో మరింతగా బలపడి తుఫానుగా మారి శ్రీకాకుళం, ఒరిస్సాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాలుగో తేదీన ఒరిస్సా, 5వ తేదీన పశ్చిమ బెంగాల్, 5, 6 తేదీల్లో ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.