శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:05 IST)

కుప్పంలో ప్రత్యక్షంగా నామినేషన్‌ వేయలేదు.. ప్రచారం చేయనూ లేదు.. అదెలా సాధ్యం?

సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో అసెంబ్లీ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా బరిలో నిలిచిన అభ్యర్థులు.. తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జనంలోకి చొచ్చుకెళ్తారు. కానీ, ఇక్కడ దానికి అంతా విరుద్ధం. ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యక్షంగా నామినేషన్‌లు వేయలేదు, అలాగే ప్రచారం కూడా చేయలేదు. 
 
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో బిజీగా ఉన్న చంద్రబాబు.. తన నియోజకవర్గంలో మాత్రం ప్రచారం చేసింది లేదు. నామినేషన్ కూడా చంద్రబాబు తరపున స్థానిక టీడీపీ నేతలే వేయడం గమనార్హం. లోకల్ లీడర్లే ప్రచారం చేస్తుండగా.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎప్పటికప్పుడు ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
 
మరోవైపు చంద్రబాబుకు ప్రధాన పోటీదారుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి కూడా నామినేషన్ దాఖలు సహా ప్రచారానికి దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా గొంతు సంబంధిత చికిత్స కోసం హైదరాబాద్‌లో ఉన్నారు చంద్రమౌళి. దీంతో చంద్రమౌళి తరపున ఆయన కుమారుడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రచారాన్ని కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నారు. 
 
ఓవైపు బిజీగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి దూరమైతే.. మరోవైపు అనారోగ్య కారణాలతో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు.