మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (11:43 IST)

వరుడి గెటప్ వేసుకుని గుర్రంపై వెళ్లి లోక్‌సభకు నామినేషన్ వేశాడు..

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ అభ్యర్థి లోక్‌సభకు పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ఎవ్వరూ ఊహించని రీతిలో కలెక్టర్ ఆఫీస్ చేరుకున్నాడు. ఇంతకీ అతను ఏమి చేసాడు అని ఆలోచిస్తున్నారా? 
 
ఉత్తరప్రదేశ్‌లోని షాహజహాన్‌పూర్‌లో లోక్‌సభకు పోటీ చేస్తున్న సంయుక్త్‌ వికాస్‌ పార్టీ అభ్యర్థి వైద్‌ రాజ్‌ కిషన్‌.. పెళ్లి కుమారుడు వలె ముస్తాబై వెళ్లి నామినేషన్‌ వేశాడు. షేర్వానీ వేసుకుని పెళ్లికొడుకులా గుర్రంపై బారాత్‌ తీశాడు. బారాత్‌ తీసిన ఆ అభ్యర్థి చుట్టూ భారీ సంఖ్యలో జనం కూడా చేరారు. బాలీవుడ్‌ పాటలకు చిందులేస్తూ ర్యాలీ తీశారు. వరుడి గెటప్‌తో వచ్చిన కిషన్‌ స్థానికులను ఆశ్చర్యపరిచాడు. 
 
రాజకీయాలకు అల్లుడినంటూ తన వేషధారణపై కామెంట్‌ కూడా చేశాడు. ఇవాళ తన పెళ్లి రోజు అని, అందుకే వరుడి వేషంలో వచ్చానని, నామినేషన్‌ వేసేందుకు అల్లుడిలా వచ్చినట్లు కిషన్‌ చెప్పాడు. కలెక్టర్‌ ఆఫీసులో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న కిషన్‌ను పోలీసులు ముందే అడ్డుకున్నారు. సర్దార్‌ బజార్‌ ఏరియాలో అతన్ని ఆపేశారు. అక్కడ నుంచి అతను నడుచుకుంటూ వెళ్లి నామినేషన్‌ వేశారు.