సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (19:28 IST)

జగన్ ఆల్రెడీ సీఎం అయిపోయినట్లు మాట్లాడేస్తున్నారు... ఇంతకీ ఎవరిది పైచేయి?

నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తొలిసారిగా ఒంటరిపోరు చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి పెను సవాల్ విసురుతోంది. రెండు పార్టీలు ఎంతో ముందుగా కమిటీలు వేసి మేనిఫెస్టోలు తయారుచేసినప్పటికీ పెహ్లే ఆప్ తరహాలో ప్రత్యర్థి విడుదల చేశాక చూసి చేద్దాం అని చివరాఖరి దాకా ఆగాయి. సరిగ్గా పోలింగ్‌కు ఐదు రోజుల ముందు కొద్ది నిముషాలు అటూఇటుగా రెండు పార్టీలూ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. అది రాష్ర్టంలో ఎన్నికల పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో తెలియజేస్తున్నది.
 
చంద్రబాబు నాయుడు అధికారం నిలబెట్టుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డి పెనుగులాడుతున్నారు. జగన్ ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా ఎన్నికల సభల్లో మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎదుర్కొన్న స్థితినే ఇపుడు జగన్ ఎదుర్కొంటున్నారు. చావో రేవో లాంటి పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌లు వేదికలు పంచుకున్నారు. అప్పటికి మోదీకి ఉన్న పాజిటివ్ ఇమేజ్ కొంత, పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ కొంత చంద్రబాబుకు కలిసొచ్చింది. అనుభవజ్ఞుడైన నాయకుడైతే కొత్త రాష్ట్రాన్ని కొంతవరకైనా గాడిలో పెట్టగలరనే వాదన కూడా చంద్రబాబుకు మైలేజీ ఇచ్చింది. ఈసారి పరిస్థితులు వేరేగా ఉన్నాయి.

 
జగన్ మోదీకి బీటీమ్ అని.. జగన్ గెలిస్తే రాష్ర్టం మోదీ- కేసీఆర్ పెత్తనంలోకి వెళ్లిపోతుందని తెలుగుదేశం ఆరోపిస్తుంటే, పవన్ కల్యాణ్ జనసేన తెలుగుదేశం బీ టీమ్ అని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసమే పవన్ ప్రయాస అంతా అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం చేసిన.. పనులు చేయని పనుల కంటే, విధానాల కంటే ఈ బీ టీమ్ అనే కుట్ర సిద్ధాంతాల రాజకీయాలే ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

 
ప్రత్యేక హోదానే ప్రధానాంశంగా మలుచుకున్న జగన్ అది ఇవ్వకుండా మాట దాటేసిన మోదీ జోలికి పోకుండా మాట్లాడడాన్ని తెలుగుదేశం నేతలు పదే పదే ప్రస్తావిస్తుంటే.. పవన్ అధికార పార్టీ కంటే విపక్షం మీద ప్రధానంగా దాడి చేస్తున్నారని వైసీపీ అంటోంది. రాజకీయ చైతన్యం ఎక్కువ అని చెప్పుకునే రాష్ర్టంలో ప్రజా సమస్యలు, పౌర హక్కులు, దీర్ఘకాలిక విధానాలు తెరవెనక్కు పోయి పరస్పర దూషణలే ప్రధానంగా వేదిక ఎక్కడం ప్రత్యేకంగా కనిపించే అంశం.
 
ఓదార్పు యాత్ర పేరుతోనూ, పాదయాత్రల పేరుతోనూ జగన్ జనంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నారు. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితమే పాదయాత్ర మొదలెట్టి అప్పటినుంచి ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. మీటింగులకు వచ్చే జనం వారి స్పందన గత ఎన్నికల్లోనూ జగన్ శిబిరంలో అతివిశ్వాసాన్ని పెంచాయి. ప్రయత్నాల్లోనూ ఫలితాల్లోనూ అది ప్రతిఫలించింది. చివరి పదిహేనురోజుల్లో వాతావరణం మారిపోయింది.. చంద్రబాబు ఆఖరి ఓవర్లలో అనేక రకాలుగా పించ్ హిట్టింగ్ చేశారు. ఈ సారి కూడా ప్రకటనల్లోనూ, ప్రభుత్వ నిధుల పంపిణీలోనూ ఆ ధోరణి చూపుతున్నారు.

 
అభివృద్ధి రాజధాని అని రెండు ప్రధానాంశాలు తీసుకుంటే తెలుగుదేశం పనితీరు సగం గ్లాసుగా చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్‌లో చూపించినంత కాకపోయినా రాజధానిలో పనులైతే మొదలయ్యాయి. ఇంతకుముందు నీటి చుక్క చూడని కొన్ని ప్రాంతాలకు నీళ్లొచ్చాయి-ముఖ్యంగా రాయలసీమలో. కొన్ని ఫ్యాక్టరీలు కూడా వచ్చాయి. కాకపోతే రాజధాని చుట్టూ అవినీతి ఆరోపణలు దట్టంగా కమ్ముకుని ఉన్నాయి. కాలువలు, లైనింగ్ లాంటి పనులు పూర్తి కాకముందే ఎన్నికల లోపు ఎలాగోలా నీళ్లు చూపించి లబ్దిపొందాలనే లక్ష్యంతో హడావుడిగా కొన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

 
వీటిని మించి ఇసుక తవ్వకాల విషయంలోనూ, సంక్షేమ పథకాల లబ్ది దారుల ఎంపిక కోసం నియమించిన జన్మభూమి కమిటీల విషయంలోనూ తీవ్రమైన విమర్శలున్నాయి. వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఎక్కువే. కర్షక పరిషత్ సమయంలో చంద్రబాబు నేతృత్వంలో ఎంపిక కమిటీలు కొన్ని ఉండేవి. అప్పటి వ్యతిరేకత కన్నా ఇపుడు జన్మభూమి కమిటీల పైన వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రత్యేక ప్రయోజనాలేమీ లేవంటూ అనేక వేదికలమీద చంద్రబాబు మాట్లాడి ఉన్నారు. ప్రత్యర్థి జగన్ దాన్నే అస్ర్తంగా మార్చుకుని జనంలోకి వెళ్లడం వల్ల అది ఎమోషనల్ ఎలిమెంట్ అవుతుందన్న అంచనా వల్ల చంద్రబాబు బాణీ మార్చి ప్రత్యేక హోదా అంశాన్ని తన భుజానికెత్తుకున్నారు.

 
ఇపుడు ఆ విషయంలో జగన్ ను మించి దూకుడుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మోదీతో తెగదెంపులు చేసుకుని కేంద్రంపై తిరుగుబాటు చేస్తున్న నాయకుడిగా మారారు. రాష్ర్ట ప్రభుత్వం ఏమైనా చేసి ఉంటే సానుకూల ఇమేజ్ ఉంటే అది తనఖాతాలోకి.. ఏమైనా చేయలేకపోయి ఉంటే ఆ నెగిటివ్ ఇమేజ్ మోదీ ఖాతాలోకి వేసే ఎత్తుగడ వేశారు. బీజేపీ ప్రత్యేక హోదాపై వెనక్కు తగ్గడంపై జనంలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. చంద్రబాబు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికోసం ఎంతదాకా అయినా వెళతారు. పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు అది తన ఐడియా అని ఉత్సాహంగా చెప్పుకున్నారు. ఇటీవల దానిపై విమర్శలు చేస్తున్నారు.

 
సంక్షేమ పథకాలు తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగులేని విజయాలు తెచ్చిపెట్టాయి కాబట్టి ఇక్కడా అదే మంత్రాన్ని దూకుడుగా అమలు చేస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలను, ఉచితాలను ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇపుడు తాను ఆది నుంచి వాటి కోసమే ఉన్నట్టుగా ధాటిగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడినా అదే విషయం తాను ఎప్పటినుంచో మాట్లాడుతున్న భావన కలిగించడంలో ఆయన నేర్పరి. నిన్న మొన్నటి దాకా సభలో ఉన్న బీజేపీ సభ్యులే ఆశ్చర్యపోయే రీతిలో విశేషణాలను ఉపయోగించి మోదీని పొగిడేవారు. ఇపుడేమో కమ్యూనిస్టు నాయకులు కూడా ఆశ్చర్యపోయే రీతిలో మోదీని తెగనాడుతున్నారు.
 
ఎన్నడూ నీళ్లు చూడని ఊళ్లు చూశాయి కాబట్టి గాలి తమవైపే ఉంటుందని తెలుగుదేశం ఆశిస్తోంది. అవి చూసి మిగిలిన ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలు ఆశతో తమకు అనుకూలంగా మారతాయని ఆకాంక్షిస్తోంది. రాజధాని పనులు మొదలయ్యాయి కాబట్టి పోలవరం సహా అనేకానేక ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి కాబట్టి అవి పూర్తి కావాలంటే చంద్రబాబు మరో ఐదేళ్లు ఉండాలనే అంచనాతో ఓట్లేస్తారని అనుకుంటోంది. అయితే వీటన్నింటిమీద పూర్తి భరోసాతో అయితే లేదు. అదే ఉంటే వీటిని మించి ఇక్కడ ఉనికే లేని కేసీఆర్‌ను విలన్‌గా చూపించడం లాంటి ఎమోషనల్ అంశాలకు అంత ప్రాధాన్యం ఇచ్చేది కాదు. ఒకప్పటి చంద్రబాబు సహచరుడు కేసీఆర్ వ్యూహాల్లో గురువు కంటే రెండాకులు ఎక్కువే చదివిన మనిషి.

 
అందుకే మామూలుగా ఎవరైనా ఒకమాటంటే నాలుగు అంటించే మనిషి అయి ఉండి కూడా చంద్రబాబు ప్రచారంలో ఇంతగా తిట్టిపోస్తున్నా ఇంతగా రెచ్చగొడుతున్నా నోరు విప్పడం లేదు. నోరు విప్పి ఘాటుగా ఏదైనా అంటే అది చంద్రబాబుకు లాభిస్తుంది అని తెలిసి పోలింగ్ రోజువరకు మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు అని అర్థం అవుతోంది. అన్నింటిని మించి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా పెన్షన్లను పెంచేసి, చెక్కులు ఇచ్చేసి డబ్బుల వర్షం కురిపిస్తోంది. ఇదైతే సానుకూల ప్రభావం చూపించగలదని తెలుగుదేశం భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రైతుబంధు నుంచి అన్నదాతా సుఖీభవ తీసుకున్నట్టుగానే తెలంగాణ ఫలితాల ధోరణిని కూడా అందిపుచ్చుకోవాలని ఆశిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడికి జనం వినికిడి శక్తిమీద అనుమానం. ఆయన ఏ విషయాన్ని అయినా వంద సార్లు చెప్పందే నిద్రపోరు. నిద్ర పోనీయరు.

 
పార్టీ నేతలు ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టాలంటే ఐటి దాడులు చేస్తున్నారని అందుకే ప్రభుత్వ ధనాన్ని రకరకాల స్కీముల పేర్లతో అకౌంట్లలో వేస్తున్నానని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎవరెలా అర్థం చేసుకుంటారనేది వారిష్టం. మరోవైపు జగన్ పైన ఉన్న సీబీఐ కేసులు ఆయనకు, ఆయన పార్టీకి పెద్ద గుదిబండ. ప్రధాన బలం వై ఎస్ రాజశేఖరరెడ్డి మీద ప్రజల్లో అంతో ఇంతో మిగిలి ఉన్న సానుకూలత. అలాగే చంద్రబాబుకున్న వ్యూహ చాతుర్యం జగన్ దగ్గర ఉందా అనేది సందేహం. అవినీతి ఆరోపణలు చంద్రబాబుపైనా ఉన్నప్పటికీ కేసుల విచారణలు, అండర్ ట్రయిల్‌గా జైలుకెళ్లి రావడాలు జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంశం.

 
అనుభవ రాహిత్యం మరో ప్రతికూలాంశం. అవకాశం రాకుండా అనుభవం రాదన్నది నిజమే అయినా కొత్త రాష్ర్టంలో అదొక అంశంగా ఉంటుంది. వ్యూహ నైపుణ్యం కొరవడినప్పటికీ గతంలో వలె తన అవకాశాలను తానే కాలదన్నుకునే పొరబాట్లు ఈసారి అంతగా చేయడంలేదనే మాట అయితే వినవస్తున్నది. బహుశా ప్రశాంత్ కిషోర్ ప్రభావం కావచ్చు. నాడి అంతుబట్టని కొత్త ఓటర్లు, పసుపు-కుంకుమ పేరుతో చెక్కులు అందుకున్న 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉంది. కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచన పైచేయి చూపుతుందా.. లేక కొత్తది తెచ్చిపెట్టుకోవడం కంటే మంచో చెడో ఉన్నదాన్నే కొనసాగిద్దాం అనే ఆలోచన పైచేయి చూపుతుందా? అనేది తేలాల్సి ఉంది.

 
తెలుగుదేశం ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా పురుడు పోసుకుందో ఆ పార్టీ కాంగ్రెస్‌తో చంద్రబాబు జాతీయ స్థాయిలో జతకట్టి ఉన్నారు. జగన్ మాత్రం ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే మద్దతు అని చెప్పుకొస్తున్నారు. పార్లమెంట్ ఫలితాల తర్వాత కేంద్రంలో మారే సమీకరణాలను బట్టి నిర్ణయం ఉండొచ్చు. మూడో కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్ కూడా ఒక ఆప్షన్ కావచ్చు.
 
ఇక మూడోశక్తి పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత, ఎవరి మీద అనేది ఎవరూ తేల్చలేని అంశంగా మారింది. ఆయన ఎన్నికలకు సమాయత్తమైన తీరు చూస్తే ఆయన ఈ ఎన్నికలను ఫైనల్ అనుకోవడం లేదేమో సెమీఫైనల్‌గా మాత్రమే భావిస్తున్నారేమో అనిపిస్తున్నది. నాకు కులం లేదు.. మతం లేదు అని ఆయన ఎంత చెప్పుకున్నా కుల రాజకీయాలకు పెట్టింది పేరైన తెలుగునాట రాజకీయాలు పూర్తి దూరంగా ఉండలేవు. ఏ కులమూ గంపగుత్తగా ఎవరికీ ఓటేయకపోవచ్చు గానీ ముఖ్యమైన శక్తిగా అండగా ఉండే వాతావరణం అయితే ఉంది.

 
నాడు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినపుడు కమ్మ ప్లస్ బీసీ కాంబినేషన్ ముందుకొచ్చింది. బీసీ నాయకత్వం తెలుగుదేశం హయాంలో బలపడింది. కాంగ్రెస్ సంప్రదాయంగా రెడ్డీ ప్లస్ ఎస్సీగా ఉంటూ వస్తున్నది. ఇపుడు అది నేరుగా జగన్‌కు ట్రాన్స్‌పర్ అయిపోయింది. రెడ్డీ ప్లస్ ఎస్సీ కాంబినేషన్‌ను తెలుగుదేశం కమ్మ ప్లస్ బీసీ కాంబినేషన్‌తో ఢీకొంది. ఇపుడు పవన్ కాపు ప్లస్ ఎస్సీ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తున్నది. రాష్ర్టంలో ఒక్కశాతం ఓటుబ్యాంకు కూడా స్థిరంగా లేని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంలో మతలబు అదేనేమో అనిపిస్తున్నది. బీఎస్పీకి ఓటుబ్యాంకు యంత్రాగం లేకపోయినా చదువుకున్న దళితుల్లో ఇమేజ్ ఉంది. దాన్ని మలుచుకుందామనే ప్రయత్నం ఉంది.

 
దళితుల ఓట్లు ప్రధానంగా జగన్ వైపు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఓటు బ్యాంకును చీల్చి చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి అని ప్రత్యర్థుల ఆరోపణలు వేరే కథ. పవన్ విమర్శలకు కానీ పొగడ్తలకు కానీ స్థిరత్వం లేదనేది ప్రధానంగా వినవచ్చే విమర్శ. ఒక మీటింగులో హఠాత్తుగా చంద్రబాబు మీదా ఆయన కుమారుడి మీదా తీవ్రంగా విరుచుకుపడి తర్వాత వారి మీద దూకుడు తగ్గించి విపక్ష నేత జగన్ మీద దూకుడు పెంచారు. తెలుగుదేశం మీద సాప్ట్ గా వెళుతున్నారు. చంద్రబాబుకు ఎవరైతే క్యాంపు కార్యాయలం ఇచ్చారో అదే వ్యక్తి ఇచ్చిన కార్యాలయాన్ని విజయవాడలో ఉపయోగించుకుంటున్నారనేది తరచుగా వినిపించే మరోమాట. ఇవ్వన్నీ చూపించి వైసీపీ ఆయన్ను చంద్రబాబు బీ టీమ్ కింద ప్రచారం చేస్తోంది. అధికార పార్టీ మీద కాకుండా విపక్షం మీద ప్రధానంగా దాడి చేయడం ఏంటనేది వారి వాదన.

 
అవినీతి ముద్ర లేకపోవడం ఫ్రెష్ కావడం పవన్ ప్లస్ పాయింట్లయితే, ఆవేశం తప్ప ఆలోచనాత్మక విధానాలు కరువు అనే ఇమేజ్ ప్రతికూలాంశం. నాకు అధికారం ముఖ్యం కాదు, వ్యవస్థ ప్రక్షాళన ముఖ్యం అనే వ్యక్తి తన భావజాలమేంటో స్పష్టంగా వివరించలేకపోవడం లోటు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకున్న మనిషి ఇంకాస్త లోతైన భావనలను జనం ముందు పెట్టి తానే రకంగా మంచి ప్రత్యామ్నాయమో చెప్పుకోగలిగితే ఆయన పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది. ఆస్తిపాస్తుల్లేని పదిమంది యువకులకు టిక్కెట్లిచ్చిన పవన్ కల్యాణ్ అదే విధానం ఇతరత్రా విషయాల్లోనూ చూపించి ఉంటే ఆయన చెప్పుకునే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అనే మాటకు విలువ పెరిగి ఉండేది.

 
కాంగ్రెస్ బీజేపీలు పోటీలో ఉన్నా నామమాత్రమే. సొంతంగా సీట్లు గెలవగలిగిన స్థితిలో అవి లేవు. ఆ రకంగా జాతీయ పార్టీలకు ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా రాష్ర్టం తమిళనాడు తరహాలోకి వెళ్లిపోయిన దశ మనం చూస్తున్నాం. ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నామ్‌కేవాస్తే అయిపోవడం చారిత్రక వైచిత్రి.
 
- జీఎస్ రామ్మోహన్
ఎడిటర్, బీబీసీ తెలుగు