మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By మోహన్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:30 IST)

స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం చేసిన అభ్యర్థి... ప్లీజ్.. నాకే ఓటు వేయాలంటూ విన్నపం

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎలాగోలా గెలుపొందాలని నానావిధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు స్ట్రెచర్‌పై పడుకుని కన్నీటి పర్యంతమవుతూ ప్రచారం చేశారు. ఆయనే మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి. మొదట్లో సైకిల్‌ యాత్ర, ర్యాలీలు, సభల పేరుతో పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. 
 
ఈ క్రమంలో మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ కొందరు వైకాపా నాయకులు ఆయనను అడ్డుకుని ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్‌ గాయమై కుప్పకూలారు. దీంతో ఆయన అనుచరులు కర్నూల్‌ ఆస్పత్రికి తరిలించారు.
 
అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ కార్పోరెట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పూరైన తర్వాత ప్రత్యేక అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్‌ వేశారు. కనీసం కదలడానికి వీలులేని పరిస్థితిలో కూడా భార్యతో కలిసి స్ట్రెచర్‌పై పడుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన భర్తను కాలు కదపకుండా చేశారు.. దయచేసి ఓటు వేయండి అంటూ ఆయన భార్య ప్రజలను కోరుతున్నారు.