బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 మే 2020 (19:54 IST)

న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు తగవు: ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్

రాజ్యాంగ విధుల్లో భాగంగా తీర్పులు వెలువరించే న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించడం తగదని ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు అన్నారు.

న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, ఆ ప్రకారం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఆయన చెప్పారు.

అంతేకానీ చట్టప్రకారం తీర్పులు వెలువరించె న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మూడు విభాగాలకు రాజ్యాంగపరమైన బాధ్యతలు అప్పగించిందని దాని ప్రకారం శాసన వ్యవస్థ చట్టాలు చేస్తే, సదరు చట్టాలను కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తోందన్నారు.

ఈ చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోయినా, ప్రజల ప్రాథమికహక్కులకు భంగం కలిగించినా, చేసిన చట్టాలలో చట్టబద్ధత లేకపోయినా ఆ చట్టాలను సవరించడం లేదా కొట్టివేయడం కోర్టుల బాధ్యత అన్నారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలకు అనుగుణంగా న్యాయమూర్తులు తీర్పులు ఇస్తారన్నారు.

పై వ్యవస్థలన్నీ  వాటి వాటి పరిధిలో పని చేస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తున్నారు. గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వారు కూడా దురదృష్టవశాత్తు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాల్సిన వారే అసభ్య పదజాలం వాడటం చాలా బాధాకరం అన్నారు.

ఎవరైనను న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అందరూ కూడా సంయమనం పాటించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని కోరారు.