తెలంగాణాలో ఐపిఎస్ ప్రవీణ్...పొలిటికల్ ట్రెండ్ సెట్ చేస్తారా?
ఈ సమాజానికి ఏదో చేద్దామని తమ పదవులను సైతం వదులుకుని వచ్చిన ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు దాదాపుగా ఎవరూ మన తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయింది లేదు. అప్పటికే జనాల్లో పాతుకు పోయిన పార్టీల్లో చేరి, పదవులు పొందిన వాళ్లు తప్ప, సొంతంగా పార్టీ పెట్టో లేక రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామని కొత్త పంథా ఎంచుకునో ప్రయోగం చేసిన మంచి ఆఫీసర్లు మాత్రం ఫెయిల్ అయ్యారు.
దీనికి ఉదాహరణ ఒక జేపీ, మరో జేడీ లక్ష్మీ నారాయణనే. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో మరో ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరేళ్ళ సర్వీస్ ఉండగానే, పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చారు. వెనుకబడిన బహుజనుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యం అని చెబుతున్న ఆయన తెలంగాణలో బీఎస్పీకి ఫ్రంట్ ఫేస్‌గా మారారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారిగా తెలంగాణ గురుకులాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు రాష్ట్రంలోని పల్లె పల్లెకూ చేరింది. అదే ఆయనను పవర్‌ఫుల్ లీడర్‌గా మార్చబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో సమీకరణాలు మారబోతున్నాయి. ఇన్నాళ్లూ మాయావతి జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దళిత్ అజెండాను బీఎస్పీ ఫిక్స్ చేసింది. దొరల పార్టీలు కూడా ఈ అజెండాను ఫాలో అవక తప్పదు. ఈ క్రెడిట్ అంతా ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కే దక్కుతుంది.
తెలంగాణలో గురుకులం అనగానే వెంటనే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల నిర్వహణలో తనదైన ముద్ర వేసిన అధికారి ఆయన. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను అట్టడుగు వర్గాల విద్యార్థుల అవసరాలకు, వారి ఎదుగుదలకు వేదికగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. ఆరేళ్ల సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్‌లో చేరతారని అందరూ భావించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ క్యాండిడేట్‌గా ఆయన పోటీ చేస్తారని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ప్రవీణ్ కుమార్ ఖండించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి రావు పూలే సిద్ధాంతాల ప్రాతిపదికన తన రాజకీయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ సమక్షంలో నల్లగొండలో జరిగిన భారీ బహిరంగ సభలో బహుజన్ సమాజ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రవీణ్ కుమార్ కు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.
తన లక్ష్యం సాధనలో ఎవరికీ భయపడబోనని, జైలుకు పోవడానికే కాదు ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధమేనని పలు ఇంటర్వ్యూల్లో ఇప్పటికే చెప్పారు. దీని ద్వారా రానున్న రోజుల్లో టీఆర్ఎస్‌తో పాటు అగ్రవర్ణ పార్టీలుగా ముద్ర పడిన అన్ని పక్షాల మీద ఆయన యుద్ధ భేరి మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. బహుజన సమాజం నుంచి ఎదిగొచ్చిన విద్యావంతుల్లో ప్రవీణ్ కుమార్‌కున్న ఫాలోయింగ్‌ను అంత ఈజీగా కొట్టి పారేయలేమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
ఆర్ఎస్ ప్రవీణ్ రాజకీయాల్లోకి రావడం వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ అని చెప్పాలి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, క్రైస్తవుల ఓట్లే లక్ష్యంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ అన్న పేరుతో పార్టీ పెట్టి ముందుకొచ్చారు. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తానని చెబుతూ కాంగ్రెస్ ఓటింగ్‌ను తన వైపు తిప్పుకొని తెలంగాణలో ఎదగాలని అనుకుంటున్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావడం, అదీ బీఎస్పీ జెండా పట్టుకుని నిలవడం షర్మిల వ్యూహాలన్నీ నీటి మీద రాతలుగా మారిపోయే ప్రమాదం వచ్చినట్టయింది. ఆర్ఎస్ ప్రవీణ్‌పై తెలంగాణ వాడిగా ఉన్న ముద్ర, పల్లె పల్లెల్లో ఆయనకు యువతో ఉన్న ఫాలోయింగ్ రేపటి రోజున గట్టి నాయకుడిగా నిలబెడుతుంది. కానీ మొదటనే షర్మిలపై తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ఆర్ బిడ్డగా ఒక నెగటివ్ సెంటిమెంట్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ రాక ఆమె పార్టీకి కచ్చితంగా పెద్ద దెబ్బే.