శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (16:03 IST)

ఆంధ్రప్రదేశా...అదానీ ప్రదేశా? గంగవరం పోర్టులో 89.6% వాటా

ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మారుస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్  ధ్వజమెత్తారు. పోర్టుల నుంచి విద్యుత్ కాంట్రాక్టుల వరకు వారికి కట్టబెట్టేందుకు తెర వెనుక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తన తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుట్ర చేసారని, ఆ సమయంలో విస్తృత ప్రచారం చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అదే అంబానికి సంబంధించిన నత్వానీకి రాజ్య సభ సీటు ఎలా ఇచ్చారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
 
ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలుపు వెనుక మోడీ, అమిత్ షా, అదానీల పాత్ర ఉందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఆంధ్ర రత్న భవన్ నుండి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. పాదయాత్రలో జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ రాష్ట్ర సంపదను ఆదానీ, అంబానీలకి దోచి పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్త్తుతం విద్యుత్ కాంట్రాక్టులను కూడా అప్పగించేందుకు సిద్దమయ్యారని  విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన అదానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ని తాడేపల్లి నివాసంలో కలిసి చర్చించిన రహస్యాలను ప్రజలకు బహిర్గతం చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేసారు.
 
 
అంత దొంగ చాటుగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అదానీ కంపెనీ నుంచి రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించిన 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ వల్ల రాష్ట్రంపై అదనంగా రూ.లక్షా ఇరవై వేల కోట్ల భారం పడుతుందని  ఆరోపించారు. ఈ విద్యుత్ యూనిట్కు రూ.2.49కే వస్తుందని జగన్ రెడ్డి సర్కారు చెబుతున్న మాట అసత్యమని, రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు ఇది చేరేసరికి యూనిట్ ధర రూ.3.50 నుంచి రూ.4.50 అవుతుందని చెప్పారు. ఇది రైతుల కోసం పెట్టిన ఉచిత విద్యుత్ స్కీం అమలుకు కొంటున్నది కాదని, అదానీ కోసం ప్రభుత్వం చేస్తున్న స్కామ్ అని దుయ్యబట్టారు. 
 
 
ఓపక్క సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2లోపే దిగిపోతున్న ఈ సమయంలో ఇంత ఎక్కువ ధర పెట్టి అదానీల కరెంటు కొనాల్సిన అవసరం ఏమిటని శైలజనాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సింది పోయి వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కరెంటు ఉత్పత్తి చేస్తే అధిక ధరకు మనమెందుకు కొనాలని నిలదీశారు. ప్రజలు చెమటోడ్చి సంపాదించుకున్న దాన్ని దేశంలోనే రెండోఅతిపెద్ద ధనవంతుడైన వ్యక్తికి దోచిపెట్టడానికే ప్రభుత్వం, 10వేలమెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంచేసుకుందా? అని ప్రశ్నించారు. 2024లో విద్యుత్ సరఫరాకు ఇప్పుడున్న అధికధరలప్రకారం ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? 2024 యూనిట్ విద్యుత్ రూ.1.26పైసలకు వస్తుందని చెబుతుంటే, ఈప్రభుత్వం యూనిట్ రూ.3.50పైసలనుంచి రూ.4.50పైసలకు కొనడం అన్యాయంకాదా? అని శైలజనాథ్ ప్రశ్నించారు.
 
 
గంగవరం పోర్టులో అదానీకి 89.6% వాటా, గంగవరం పోర్టు లిమిటెడ్(జీపీఎల్)లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) లిమిటెడ్ తెలిపింది. జీపీఎల్లో వార్బర్గ్ పింకస్ సంస్థకు చెందిన 31.5 శాతం వాటాను మార్చి 3న ఏపీఎస్ఈజెడ్ కొనుగోలు చేసిందని, వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు వాటాను కలిపితే జీపీఎల్లో తమ వాటా 89.6 శాతానికి చేరుకుందని ఆ సంస్థ పేర్కొందని వివరించారు.
 
 
కృష్ణపట్నం..అదానీ పరం,  కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుందని, ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసిందని, కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసిందని, దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరిందని, గతేడాది అక్టోబర్ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపిందన్నారు. 
 
 
ఎక్కువ ధరకు అదానీ కరెంటు కొనడం వల్ల దానిని పేదలు, సామాన్యులే కరెంటు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని సవాల్ చేస్తున్నానని, దమ్ముంటే జవాబివ్వాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.