సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (15:28 IST)

'అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన' - వైకాపా ట్వీట్‌పై వివాదం

ysrcp poster
మహాశివరాత్రిని పురస్కరించుకుని' అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన' పేరుతో ఏపీలోని అధికార వైకాపా పార్టీ చేసిన ట్వీటి ఇపుడు వివాదాస్పదమైంది. ఈ ట్వీట్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బీజేపీతో పాటు.. అనేక హిందూ సంస్థల నేతలు, ప్రతినిధులు ఆగ్రహిస్తూ, తక్షణం ఆ ట్వీట్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
శనివారం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. "అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ… శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. దీనికి కింద ఓ ఫోటో పెట్టారు. అందులో పంచకట్టులో ఉన్న జగన్.. చిన్నారికి పాలు తాగిస్తున్నారు. చిన్నారి చేతిలో ఉన్న వస్తువు, చిరుతపులి తోలును పోలిన దుస్తులు, పక్కనే ఉన్న నందిని చూస్తే.. బాల శివుడికి జగన్ పాలు తాగిస్తున్నట్లుగా ఉంది.
 
ఇదే ఇపుడు వివాదాస్పదంగా మారింది. బాల శివుడికి జగన్ పాలు పట్టిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువులను హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివాదాస్పద పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
ముఖ్యమంత్రి జగన్ బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. వైసీపీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని, అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.