జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టే : ఎంపీ రఘురామరాజు
నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టేనని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తమ వరకు ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేని, గత ప్రభుత్వం దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ జారీ చేసిందని, మూడు రాజధానుల అంశం తమ దృష్టికిరాలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం బుధవారం స్పష్టం చేసిన విషయం తెల్సిందే. దీనిపై రఘురామరాజు గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఏపీ రాజధాని అంశంపై కేంద్రం ఓ స్పష్టతనిచ్చిందన్నారు. విశాఖ రాజధాని అంటున్న సీఎం జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టేనని చెప్పారు. కావాలనుకుంటే జగన్ విశాఖకు వెళ్లవచ్చన్నారు. అవసరం లేనివారు కోటలో ఉన్నా... పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు. రాజధాని అశంపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్న అడిగినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, ఇపుడు విశాఖ రాజధానిగా మార్చాలంటే పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందన్నారు.
ఏపీ సీఐడీ పోలీస్ విభాగం సీఎం జగన్ రెడ్డి డైరెక్షన్‌లో పని చేస్తుందన్నారు. తనను చిత్రహింసలు పెట్టి హింసించిన అంశంలో రెండేళ్ళ తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందన్నారు. తనను హింసించిన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. తన ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని, ముఖ్యంగా, తనకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.