శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (06:47 IST)

23 నుండి 'జగనన్న విద్యాకానుక వారోత్సవాలు'

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యాకానుక’ పథకం అమలు తీరును మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతో ‘’జగనన్న విద్యాకానుక వారోత్సవాలను’’ రాష్టంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 23 నుండి 28 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

వారోత్సవాల్లో ఎక్కడైనా చిన్న, చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని గుర్తించి  సరిదిద్దుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మరింత పక్కా ప్రణాళికతో ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది అక్టోబరు 8న కృష్ణాజిల్లా పునాధిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా  రాష్ట్రంలోని మొత్తం 46 వేల 593 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి  చదువుతున్న 42 లక్షల 34 వేల 322 మంది  విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, ఒక సెట్  నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, 3 మాస్కులతో పాటు బ్యాగును కిట్ రూపంలో అందించామ‌ని తెలిపారు.

అయితే ఆయా కిట్లను విద్యార్థులు అందరికీ అందాయే, లేదో పరిశీలించడానికి, వాటి వినియోగంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు, పొరపాటున ఎక్కడైనా ఏమన్నా లోటుపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకొనేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 28 వరకు రోజుకో అంశంపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు ఈ దిగువ  తెల్పిన విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని మ‌త్రి తెలిపారు. 
 
23.11.20 (సోమవారం)
విద్యార్థులకు, తల్లిదండ్రులకు ‘జగనన్న విద్యాకానుక’ గురించి అవగాహన కల్పించడం. ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందిందా, లేదా పరిశీలించడం. బయోమెట్రిక్ అథంటికేషన్ తనిఖీ చేయడం.
 
24.11.20 (మంగళవారం)
విద్యార్థులు యూనిఫాం కుట్టించుకున్నారో లేదో పరిశీలించడం. కుట్టు కూలీ ఖర్చులు నేరుగా తల్లుల ఖాతాకు  ప్రభుత్వం వేస్తున్న విషయాన్ని తెలపడం. యూనిఫాం కొలతలు  గురించి, దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం.
 
25.11.20 (బుధవారం)
విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం. బూట్లు కొలతల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడం.
 
26.11.20 (గురువారం)
పాఠ్య పుస్తకాలకు, నోటు పుస్తకాలకు, వర్క్ బుక్కులకు అట్టలు వేసుకునేలా, పుస్తకాలను ఉపయోగించుకోవడం పట్ల అవగాహన కల్పించడం.
 
27.11.20 (శుక్రవారం)
బ్యాగులు వాడే విధానం, పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి చర్యలు, అవగాహన కల్పించడం. బ్యాగుల విషయంలో ఏవైనా సూచనలు ఉన్నట్లయితే సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం.
 
28.11.20 (శనివారం)
‘జగనన్న విద్యాకానుక’ కిట్ లో అన్ని వస్తువులు అందాయా లేదా అని తెలుసుకోవడం. బయోమెట్రిక్ సరిగా ఉందో లేదో పరిశీలించడం,  జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలీ నిమిత్తం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జతకు రూ. 40 చొప్పున 3 జతలకు రూ.120, 9, 10 తరగతుల విద్యార్థులకు జతకు రూ.80 చొప్పున 3 జతలకు రూ.240 నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం అందిస్తుందన్న విషయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియడం జరుగుతుందన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, జిల్లా ఉప విద్యా శాఖాధికారులు, సీఎంవోలు, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు వారివారి స్థాయిల్లో వ్యక్తిగత బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.