శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (06:42 IST)

ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే తెలపండి

ఇటీవల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లయిమ్ లు, అభ్యంతరాలు తెలియజేయాలని రాజకీయ పార్టీలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు. నూతన ఓటర్ల నమోదుకు కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు.

సచివాలయంలోని అయిదో బ్లాక్ లో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలతో శుక్రవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ మాట్లాడుతూ, ఈ నెల 16 వ తేదీన ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామన్నారు.

1500 ఓటర్లతో కూడిన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్వహించిన రేషనలైజేషన్ తరవాత ఈ ముసాయిదా జాబితా రూపొందించామన్నారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులకు క్లయిమ్ లు, అభ్యంతరాలు తెలియజేస్తే, పరిష్కారం చూపుతామన్నారు. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ రూపొందించామన్నారు.

డిసెంబర్ 15వ తేదీ వరకూ క్లయిమ్ లు, అభ్యంతరాలు తెలియజేస్తే, జనవరి 5, 2021లోగా వాటికి పరిష్కారం చూపుతామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో కూడిన హార్డ్ డిస్కలను సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేశారు. ఇదే జాబితాను http;//www.ceoandhra.nic.in లో కూడా అందుబాటులో ఉంచామన్నారు.

అలాగే, ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహిస్తామన్నారు. ఆ ప్రత్యేక దినాల్లో ఉదయం 10 గంటలన చి సాయంత్రం 5 గంటల వరనకూ ఈ ముసాయిదా ఓటర్ల జాబితాతో సంబంధిత పోలింగ్ స్టేషన్లలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. రాజకీయ పక్షాల బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్ల ముసాయిదా పరిశీలించి...క్లయిమ్ లు, అభ్యంతరాలు తెలిపితే అక్కడికక్కడే పరిష్కారం చూపుతామన్నారు.

ఈ ప్రత్యేక రోజుల్లోనే నూతన ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితా 2021 జనవరి 15 ప్రచురిస్తామన్నారు.

బూత్ లెవల్ ఏజెంట్లతోనే తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారీ...
ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లు నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంతో తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి వీలు కలుగుతుందన్నారు.

ఇప్పటికే ఎన్నో పర్యాయాలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని కోరుతూ వస్తున్నామన్నారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లను ఏ పార్టీ పూర్తి స్థాయిలో నియమించడం లేదన్నారు. ఇప్పటికైనా పార్టీలన్నీ అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ తమ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆయన కోరారు.

ముసాయిదా ఓటర్ల జాబితా సమయంలోనే క్లయిమ్ లు, అభ్యంతరాలు తెలపడం వల్ల తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపకల్పన చేయొచ్చునన్నారు. ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయంటూ హడావిడి చేసే బదులు ఇప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే  తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించుకోవొచ్చునన్నారు. ఈవిధంగా చేయడం వల్ల అన్ని పార్టీలకూ మేలు కలుగుతుందన్నారు. 

4 కోట్లకు పైగా ఓటర్లతో మూసాయిదా జాబితా...
పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ తరవాత నూతన ఓటర్ల నమోదు చేపట్టామని ఈ నెల 16 నాటికి రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితా తయారు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. వారిలో పురుష ఓటర్లు 1,97,91,797 మంది ఉండగా, స్త్రీ ఓటర్లు 2,02,83,145 మంది ఉన్నారన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,083 మంది ముసాయిదా జాబితాలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఓవర్సీస్ కు చెందిన ఓటర్లు 7,126 మంది ఉండగా, వారిలో పురుషులు 5,610 మంది, స్త్రీలు 1,514 మంది, థర్డ్ జెండర్స్ ఇద్దరు ఉన్నారన్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 1,03,336 మంది, సర్వీసెస్ ఓటర్లు 66,649 మంది ఉన్నారన్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయానికి 3,93,45,717 మంది ఉండగా, 2020 నాటికి 3,99,37,394 మంది ఓటర్లగా నమోదయ్యారన్నారు.

ఈనెల 16వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 4,00,79,025కు చేరిందన్నారు. కొత్తగా 3,26,824 మంది ఓటర్లను నమోదు చేశామన్నారు. ఆన్ లైన్ లో 45 వేల దరఖాస్తులు రాగా, 33 వేల మందిని ఓటర్లగా చేర్చామన్నారు. ఇంకా 8 వేల దరఖాస్తు పరిశీలించాల్సి ఉందన్నారు. 

80 లక్షల మంది కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు...
రాష్ట్రంలో కొత్తగా 80 లక్షల మంది ఓటర్లకు స్టాండర్డ్ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటీ కార్డులు జారీ చేసినట్లు  ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు 740 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్లందరికీ అందుబాటులో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఓటరు నివాసానికి 2 కిలో మీటర్ల దూరంలోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేషనలేజేషన్ తరవాత రాష్ట్రంలో 45,917 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.

టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సహకరించండి...
రాబోయే మార్చి నెలలో 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల సంబంధించిన ఓటర్ల నమోదుకు సహకరించాలని రాజకీయ పార్టీలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. నేటి వరకూ 30 వేల మంది ఉపాధ్యాయులు ఓటర్లగా తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు ఉందని, ఆలోగా రాష్ట్రంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఓటర్లగా తమ నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 49 పోలింగ్ స్టేషన్లను ఇష్టానుసారంగా రేషనలైజేషన్ చేశారని  రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చేశారని  రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హామీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ ప్రతినిధి జల్లి విల్సన్ మాట్లాడుతూ, గిరిజనులకు అందుబాటులో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో పాటు ఆ పార్టీ లీగల్ అడ్వకేట్ బి.వెంకటేశ్వరరావు, వైఎస్సారీసీపీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి, సీపీఐ తరఫున మాజీ ఎమ్మెల్సీ జె.విల్సన్, సీపీఎం ప్రతినిధిగా జె.ప్రభాకర్  పాల్గొన్నారు.