శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (13:52 IST)

జ‌న‌సేన ఆశావహుల దరఖాస్తుల పరిశీలనకు విధివిధానాలు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి స్వీకరించే దరఖాస్తు (బయోడేటా) నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.) ఆమోదం తెలియచేసింది. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పి.ఎ.సి. సమావేశమైంది. దరఖాస్తు నమూనా, పరిశీలన ప్రక్రియ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 
 
ఈ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన చేసే స్క్రీనింగ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులో ఎటువంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు లాంటి అంశాలపై పి.ఎ.సి. చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేశారు. 
 
దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాలని స్క్రీనింగ్ కమిటీకి పి.ఏ.సి. సూచించింది. స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియచేసింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ మాదాసు గంగాధరం, శ్రీ రావెల కిషోర్ బాబు, శ్రీ పి.బాలరాజు, శ్రీ ఎం.రాఘవయ్య, శ్రీ అర్హం ఖాన్, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్, పార్టీ అధ్యక్షుల రాజకీయ సలహాదారు శ్రీ పి.రామ్మోహన్ రావు, పి.ఎ.సి. సభ్యురాలు శ్రీమతి సుజాత పాండా, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.