శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (11:34 IST)

రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడిచినా చూస్తారు.. జగన్ పాదయాత్ర వేస్ట్: జేసీ దివాకర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వేస్ట్ అని తెలుగుదేశం నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ చేస్తున్న యాత్రతో ఆయన బలం పెరిగిందని భావించాల్సిన అవసరం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వేస్ట్ అని తెలుగుదేశం నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ చేస్తున్న యాత్రతో ఆయన బలం పెరిగిందని భావించాల్సిన అవసరం లేదని తెలిపారు. రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడుస్తున్నా చూసేందుకు ప్రజలు ఎగబడతారని జేసీ చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నేతన జగన్ అభిప్రాయాలను విభేధిస్తానే తప్ప.. జగన్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకడని జేసీ తెలిపారు. అనంతలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 
 
ప్రజలకు వ్యతిరేకంగా పోవడం ప్రభాకర్ దురదృష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా కలుషిత రాజకీయాలే నడుస్తున్నాయని జేసీ అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్నట్టుగా ఎమ్మెల్యేలు ఇప్పుడు లేరని, ఎవరో ఒకరు మాత్రమే దిగజారారని చెప్పలేమని, అలసత్వం, లంచగొండితనం, ప్రజలకు దూరంగా ఉండటం ఎమ్మెల్యేలకు నిత్యకృత్యమైందని ఆరోపించారు. 
 
అభివృద్ధికి సుదూరంగా ఉన్న అనంతపురం నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో ఓ ఎంపీగా తాను విఫలం అయ్యానని జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని ఎన్నో ప్రాంతాలకు నీరు లభిస్తోందని, తాను అడిగిన చాగలమర్రికి మాత్రం నీరు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. అందుకే నీరు ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబుకు స్పష్టం చేశానని తెలిపారు. ఆ తర్వాతే కొంత నీరు వచ్చిందని చెప్పుకొచ్చారు.