శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (17:56 IST)

జనరంజకంగా జగన్ పాలన.. 100కు 150 మార్కులు : జేసీ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన జనరంజకంగా సాగుతోందని, ఆయన పాలనకు వందకు 150 మార్కులు వేయొచ్చని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఆయన అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది.. 100కి 150 మార్కులు వెయ్యాలని సెటైర్ వేశారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమ అబ్బాయే అన్నారు. అయితే పరిపాలనలో కిందామీద పడుతున్నాడన్నారు. 
 
రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటే.. ఆయన కళ్లకు తమ ట్రావెల్స్ బస్సులో కనిపిస్తున్నాయన్నారు. పైగా, ఇప్పటివరకు 31 బస్సులను సీజ్ చేశారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. 
 
తాము గత ఏడు దశాబ్దాలుగా వాహనరంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని.. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం ఎంతవరకు సబబు అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. 
 
రాజకీయ నేతలు ప్రతి ఒక్కరూ తమతమ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడంలో తప్పులేదన్నారు. అదేసమయంలో గత టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, నీటి నిల్వ ప్రాజెక్టులు లేకపోతే ఎన్ని వర్షాలు పడినా ఫలితముండదన్నారు.