శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:42 IST)

జగన్ ఎంతో మారిపోయారు.. ఆయన పులిబిడ్డ.. సినీ హీరో రాజశేఖర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రోజా, అలీ, పోసాని వంటి సినీ స్టార్లు వుండగా, తాజాగా వైకాపాలో యాంగ్రీ స్టార్ హీరో రాజశేఖర్ చేరారు. సోమవారం ఉదయం తన సతీమణి జీవితతో కలిసి లోటస్ పాండ్‌కు వచ్చి, జగన్‌తో చర్చించి, వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
జగన్‌ను కలుద్దామని వచ్చామని.. ముందు చూసిన జగన్ వేరు ఇప్పుడున్న జగన్ వేరని రాజశేఖర్ అన్నారు. గతంలో కొన్ని పార్టీలతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని, వాటన్నింటినీ తొలగించుకుంటూ వచ్చానని రాజశేఖర్ చెప్పారు. ఎన్నికలకు ముందే తనకు గతంలో జగన్‌తో ఏర్పడిన అభిప్రాయబేధాలను తొలగించుకోవాలని భావించామన్నారు. 
 
అందుకే ఆయన్ని కలిసి.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నామని చెప్పారు. ఏపీకి చంద్రబాబు నాయుడు సూపర్ సీఎం అనుకుంటే, ఆయన్ను దించేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సూపర్, డూపర్ సీఎం అనిపించుకున్నారని, అంతకుమించి జగన్ చేయగలడన్న నమ్మకం తనకుందని అన్నారు. 
 
ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ప్రజల మనసుల్లో ఉండిపోయారని రాజశేఖర్ కొనియాడారు. జగన్ మామూలు బిడ్డ కాదని, పులిబిడ్డని చెప్పారు. జగన్ తమపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపించారని ప్రశంసలు గుప్పించారు.