గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:27 IST)

కళ్యాణదుర్గం పీఎస్‌లో బాబు - లోకేశ్‌లపై కేసు నమోదు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషనులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేశారు. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌కు ఇటీవల మంత్రిపదవి వరించింది. ఏపీ సీఎం జగన్ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు లక్కీ ఛాన్స్ వరించింది. ఆ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కళ్యాణదుర్గంకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు నియోజకవర్గ వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌‌ను మళ్లించారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే, మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్లే ఆస్పత్రికి తీసుకెళుతున్న చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకుని మృత్యువాతపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు తమతమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీరిద్దరూ అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారంటూ కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.