అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై కేసు
పోలీసులను, అధికార వైకాపా పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడుతో సహా మొత్తం 9 మంది తెదేపా నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండుగ పెద్ద జాగారం వేడుకలు జరిగాయి. ఇందులోభాగంగా ఈ నెల 15వ తేదీన అబీద్ కూడలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది.
రాత్రి 11.10 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ తదితరులు పోలీసులను, వైకాపా నేతలను దూషించి, పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారని పేర్కొంటూ నర్సీపట్నం పోలీసులు ఐపీసీ 353, 294 (ఏ, బి), 504, 505(ఏ), రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.