శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 23 జనవరి 2020 (22:16 IST)

అజ్ఞాతంలోకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌

నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తిగత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.
 
తన ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని బండి సంజయ్‌ చెబుతుండగా అలాంటిది ఏమీలేదని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. కాగా నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థిపై తెరాస దాడి చేయగా ఆ విషయమై పోలీసులతో చర్చించగా వివాదం మరింత ముదిరిందని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
ఉదయం గాయపడిన కార్యకర్తని ప్రభుత్వాసుపత్రికి ద్విచక్ర వాహనంపై వెళ్లి పరామర్శించిన ఎంపి బండి సంజయ్ తరువాత ఫోన్లో ఎవరికి అందుబాటులో లేకపోవడం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

కాగా ఆయనకు భద్రత కల్పిస్తానన్నా, ఆయన వద్దని వారించడం, గతంలో పార్లమెంట్లో పోలీసులు తనపై దాడి చేశారని ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడంతో గత కొద్దిరోజులుగా పోలీసులకు ఎంపీకి మధ్య వివాదం ముదురుతుండటం గమనార్హం. ఈ నేపధ్యంలో సంజయ్ విశ్రాంతి కొరకు అన్నిటికి దూరంగా వెల్లడా లేక పోలీసులతో వివాదం కారణంగా అజ్ఞాతంలోకి లోకి వెల్లడా అనే ప్రశ్న ప్రజల్లో కలుగుతుంది.