శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కార్తికేయ సొసైటీలో భారీ స్కామ్ : రూ.21.58 కోట్లు మాయం

కాకినాడలోని కార్తికేయ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌లో భారీ స్కామ్ జరిగింది. డిపాజిట్లకు అధిక వడ్డీలు చెల్లిస్తామని పొదుపరుల నుంచి రూ.కోట్లలో సేకరించాక నిలువునా ముంచేసింది. వసూలు చేసిన మొత్తాన్ని చిట్టాల్లో నమోదు చేయకపోవడం, నకిలీ డిపాజిట్లతో రుణాల మంజూరు, బినామీ రుణాలతో నిధులు సొంతానికి వాడుకోవడం వంటి అతిక్రమణలతో ఏకంగా రూ.21.58 కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. 
 
ఈ కంపెనీ మోసం వెలుగులోకి రావడంతో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిపిన విచారణలో ఈ మోసం బయటపడింది. సొసైటీ ఛైర్మన్‌, మేనేజర్‌, సభ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సహకార శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. 
 
దుర్వినియోగమైనట్లు గుర్తించిన రూ.21.58 కోట్ల మొత్తంలో.. రూ.10.05 కోట్లు 226 మంది ఖాతాదారుల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కింద వసూలు చేశారు. వాటిని చిట్టాలోనూ, సొసైటీ ఖాతా పుస్తకాల్లోగానీ నమోదు చేయలేదు. 
 
బినామీ రుణాల పేరుతో రూ.5.36 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. 269 మంది పేరుతో నకిలీ డిపాజిట్లు సృష్టించి రూ.2.56 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తేల్చారు. వడ్డీతో సహా రికవరీ, క్రిమినల్‌ చర్యలుతీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు జిల్లా సహకార అధికారి బి.కె.దుర్గాప్రసాద్‌ తెలిపారు.