రూ.2 దొంగిలించిందనీ కొరివితో వాతపెట్టిన కసాయి తల్లి
ఓ తల్లి కన్నతల్లి పట్ల కర్కశంగా నడుచుకుంది. రెండు రూపాయలు దొంగిలించిందన్న అక్కసుతో నిప్పు కొరివితో వాతపెట్టింది. దీంతో ఆ చిన్నారి నొప్పితో తల్లడిల్లిపోయింది. నొప్పికి తాళలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో విషయం బయటపడింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లికి చెందిన ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కర్ర తీసి అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది.
చిన్నారి అరుపులు విని ఇంట్లోకి వెళ్లిన చుట్టుపక్కల వాళ్లు తల్లి రాక్షసత్వాన్ని చూసి నివ్వెరపోయారు. ఆమె నుంచి ఆ బాలికను విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపైనా ఆ మహిళ అంతెత్తున లేచింది. రెండు రోజుల క్రితం కూడా పారతో తన ముఖంపై కొడితే పళ్లు ఊడొచ్చాయని బాలిక చెబుతుంటే చుట్టుపక్కలవారు చలించిపోయారు.
ఈ విషయాన్ని ఐసీడీఎస్ సీడీపీవో దయామణితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ చిన్నారని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.