రాజమండ్రి స్టేషన్‍లో విషాదం.. రైలు ఎక్కే క్రమంలో కాళ్లు పోగొట్టుకున్నయువకుడు
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. రైలు ఎక్కే క్రమంలో ఒక యువకుడు తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. బాధితుడిని ఖమ్మ జిల్లా వాసిగా గుర్తించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఖమ్మ జిల్లాకు చెందిన డి.నరేశ్ (26) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఎంబీఏ చేయాలనే ఉద్దేశ్యంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో ఆయనకు విశాఖపట్టణంలోని ఓ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కాలేజీలో చేరేందుకు విశాఖకు బయలుదేరారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. రిజర్వేషన్ లభించకపోవడంతో జనరల్ బోగీలోనే రాజమండ్రి వరకు వచ్చాడు. అక్కడ ఏసీ టిక్కెట్ తీసుకనేందుకు కిందకు దగినా ఆ అవకాశం లేదని తెలియడంతో మళ్లీ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికే రైలు బయలుదేరింది.
దీంతో యువకుడు తన లగేజీతో సహా కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో బోగీలు, పట్టాలు మధ్య పడిపోవడంతో కాళ్లు ఇరుక్కుని పోయాయి. ఈలోపు రైలు వేగం పుంజుకోవడంతో ఫ్లాట్‌ఫాం విడిచి వెళ్లింది. రైలు వెళ్లిపోయే సమయానికి నరేశ్ రెండు కాళ్లు తెగిపోయాయి. పట్టాలపై పడివున్న ఆ యువకుడిని రైల్వే సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.