శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (11:32 IST)

టీడీపీ మంత్రి రాజీనామా చేయాల్సిందే.. ఎందుకంటే?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్న కిడారి శ్రావణ్ కుమార్ తన మంత్రిపదవికి రాజీనామా చేయనున్నారు. చట్టసభల్లో సభ్యుడు కాని ఆయన గతేడాది నవంబరు 11వ తేదీన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరు నెలల వ్యవధి ఈ నెల 10వ తేదీతో ముగుస్తుంది. 11వ తేదీ నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తండ్రి, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో శ్రావణ్‌కు మంత్రిగా అవకాశం లభించిన విషయం తెలిసిందే.
 
రాష్ట్ర శాసనసభకు గత నెల 11వ తేదీన పోలింగ్‌ జరిగినా.. ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడతాయి. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొన్ని రోజులు పడుతుంది. పదో తేదీతోనే ఆరునెలల గడువు ముగుస్తుండడంతో రాజ్‌భవన్‌ అప్రమత్తమైంది. 
 
ఒక మంత్రి చట్టసభల సభ్యుడు కాలేక ఆటోమేటిగ్గా పదవి కోల్పోవడం అవమానకరంగా ఉంటుందని.. అందువల్ల పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేసినట్టు సమాచారం. దీంతో శ్రావణ్ కుమార్ నేడో రేపో తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.