ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జోరుగా వలసలు సాగుతున్న తరుణంలో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయడం కలకలం సృష్టించింది.
దీనిపై ఆరా తీయగా, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. అదేసమయంలో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి ఆయన అందజేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలువురు టీడీపీ, వైకాపా నేతలు తమతమ మాతృపార్టీలకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌లు రాజీనామా చేయగా, వైకాపా నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు శుక్రవారం రాజీనామాలు చేశారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీల్లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.