శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (13:18 IST)

టీడీపీతో సహా 120 మంది ఎంపీల మూకుమ్మడి రాజీనామా?

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అంతేకాకుండా, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ పార్లమెంట్ చివరి రోజున తెలుగుదేశం పార్టీతో సహా విపక్ష పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇదే నిజమైతే మూడు దశాబ్దాల క్రితం జరిగిన చరిత్ర పునరావృత్తమైనట్టే. 
 
నిజానికి గత 1989 సంవత్సరంలో బోఫోర్స్ స్కామ్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు రాజీవ్ గాంధీ నిరాకరించారు. పైగా, సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) విచారణకు తిరస్కరించారు. దీంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్‌ ఊహించని నిరసనకు దిగింది. ఈ కూటమిలోని 12 మిత్రపక్ష పార్టీలకు చెందిన 106 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేసారు. దీంతో లోక్‌సభ సంక్షోభంలో పడిపోయింది. 
 
ఇపుడు కూడా అచ్చం అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కోట్లాది రూపాయల అవినీతితో పాటు అధికార దుర్వినియోగం జరిగినట్టు విపక్ష పార్టీలన్నీ కోడై కూస్తున్నాయి. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుకు ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న భావనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు తర్జనభర్జనలు పడుతున్నారు. 
 
రాఫెల్ స్కామ్‌లో ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని మోడీ మాటమాత్రం కూడా స్పందించడం లేదు. పైగా, జేపీసీ విచారణకు కూడా ససేమిరా అంటున్నారు. పైగా, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మోడీ సర్కారు తిరస్కరించారు. అలాగే, దేశంలో ప్రతిపక్ష పార్టీలపై అణచివేత చర్యలకు పాల్పడటానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. లోక్‌సభకు చివరి రోజు అయినా.. మోడీ సర్కారు తీరుపై ఆఖరి పోరాటంగా.. ప్రతిపక్షాలన్నీ సంఘటితమయ్యాయనడానికి సంకేతంగా రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. 
 
ఇదే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ, బీఎస్పీ అధ్యక్షుడు, అధ్యక్షురాలు అఖిలేష్ యాదవ్, మాయావతిలతో పాటు.. ఇతర మిత్రపక్ష నేతలు చర్చలు జరుపుతున్నారు.