ముంబైలో బాలుడు అపహరణ - జగ్గయ్యపేటలో గుర్తింపు!
మహారాష్ట్ర రాజధాని ముంబైలో అపహరణకుగురైన బాలుడి ఆచూకీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో గుర్తించారు. ఈ బాలుడు గత యేడాది ఫిబ్రవరిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఆ బాలుడి ఆచూకీ యేడాదికి లభించింది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళకు రూ.2 లక్షలకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.
విజయవాడ చెందిన ఓ మహిళ ముంబైలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి దేచుపాలెయంలోని తమ బంధువైన మహిళకు రూ.2 లక్షలకు విక్రయించింది. అయితే, ఈ బాలుడు జగ్గయ్యపేటలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఆ స్కూల్ వార్షికోత్సవం జరిగింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ బాలుడిని గుర్తించి రక్షించారు. బాలుడికి సంబంధించిన ఆధారాలను పెంచుకుంటున్న తల్లిదండ్రులకు చూపించి ఆ బాలుడిని తమతో తీసుకెళ్లిపోయారు.
దీనిపై పోలీసులు స్పందిస్తూ, బాలుడిని కిడ్నాప్ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే బాలుడిని శ్రావణి అనే మహిళ కిడ్నాప్ చేసి విక్రయించినట్టు వెల్లడించడమే కాకుండా, బాలుడి ఆచూకీని కూడా తెలిపిందని చెప్పారు. మరోవైపు, గత యేడాదికాలంగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు ఒక్కసారిగా దూరం కావడంతో బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.