గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (09:52 IST)

ఏపీ గవర్నరుగా తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నరును నియమించవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ కొత్త గవర్నరు కూడా ఎవరో కాదు. యావత్ దేశ ప్రజలకు మంచి సుపరిచితమే. ఆమె కిరణ్ బేడీ. దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గవర్నరుగా ఉన్నారు. ఈమెను ఏపీ గవర్నరుగా నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగతోంది. 
 
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నరుగా ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నారు. నిజానికి ఈయన్ను ఏపీ రాష్ట్ర విభజన సమయంలో గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీ రాష్ట్ర గవర్నరుగా నియమించింది. ఆ తర్వాత ఈయన పదవీకాలం ఎపుడో ముగిసింది. కానీ, ఈయనకు కేంద్ర పెద్దలతో ఉన్న సత్‌సంబంధాల కారణంగా ఈయన పదవీకాలాన్ని కేంద్రం పొండగించింది. 
 
అయితే, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు చెక్ పెట్టేందుకు ద్వివేదీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించగా, ఇప్పుడు కిరణ్ బేడీని ఏపీ గవర్నర్‌గా పంపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నరుగా ఉన్న కిరణ్ బేడీ.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపుతున్నారు. దీంతో ఆమెను తొలగించాలంటూ ముఖ్యమంత్రి నారాయణ స్వామి కేంద్రంపై అలుపెరుగని పోరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏపీకి పంపాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, కిరణ్‌బేడీ ఏపీ గవర్నర్‌గా రాబోతున్నట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరింత జోరందుకున్నాయి.