1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:23 IST)

క‌ర‌ణం రాహుల్ హ‌త్య కేసులో కోగంటి, కోరాడ‌?

విజ‌యవాడలో యువ పారిశ్రామికవేత్త దారుణ హత్య హ‌త్య కేసులో కోగంటి, కోరాడ నిందితుల‌ని పోలీసులు పేర్కొంటున్నారు. విజ‌య‌వాడ నగరంలోని ఓ కారులో నిన్న మృతదేహం లభించింది. దర్యాప్తులో అతడు హత్యకు గురైనట్టు తేలింది.

కెనడాలో చదువుకున్న కరణం రాహుల్ (29) నాలుగేళ్ల క్రితం స్వదేశానికి తిరిగొచ్చి, మరో ముగ్గురితో కలిసి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ ప్రారంభించాడు. మరో పక్క, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల మరో కంపెనీని కూడా ప్రారంభించాడు. పోరంకిలో ఉంటున్న రాహుల్‌కు ఫోన్ రావడంతో బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లాడు.

రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్ చేస్తే, రాహుల్ ఫోన్ స్విచ్చాఫ్ అయినట్టు వచ్చింది. తెల్లవారే వరకు వేచి చూసినా రాహుల్ ఇంటికి రాకపోవడంతో రాహుల్ తండ్రి రాఘవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మొగల్రాజపురంలో ఓ కారులో మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు కారు అద్దాలు బద్దలుగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. వాహనంలో తాడు, దిండు లభించాయి. రాహుల్‌ది హత్యేనని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు తెలిసినవారే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

మరోవైపు, కంపెనీ భాగస్వాముల్లో ఒకరి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసుల అనుమానం నిజమైంది. ఈ హత్యలో కోరాడ విజయ కుమార్, అతడి భార్య పద్మజ, మరో మహిళ గాయత్రి, రౌడీ షీటర్ కోగంటి సత్యం పాత్ర ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో కోరాడ విజయ కుమార్ 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. పోలీసులు వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు.

హత్యకు ప్రధాన సూత్రధారి రౌడీ షీటర్ కోగంటి సత్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన విజయ కుమార్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. దీంతో తన వాటా తీసుకుని డబ్బులు ఇవ్వాలంటూ, గత కొంతకాలంగా రాహుల్‌ను అడుగుతున్నాడు. అయితే, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని రాహుల్ చెప్పడంతో, మొత్తం తానే తీసుకుంటానని కోగంటి సత్యం ముందుకొచ్చాడు.

ఇందుకు రాహుల్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చర్చించుకుందామని రాహుల్‌కు ఫోన్ చేసి పిలిపించి హత్య చేశారు. కారులో రాహుల్ చేతులను వెనక్కి విరిచి పట్టుకోగా, పక్కన కూర్చున్న వ్యక్తి దిండుతో ముఖంపై అదిమిపట్టుకోవడం వల్లే అతడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.