కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉంది.. ప్రధాని మోడీ శభాష్ : కోమటిరెడ్డి

komatireddy rajagopal reddy
Last Updated: ఆదివారం, 16 జూన్ 2019 (14:33 IST)
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందనీ, అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాల వల్ల దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని రాష్ట్రంలోని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీచేయనుంది.

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పుకొచ్చారు. పైగా, ఆయన ఓ అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అడ్డుకోవాలంటే బీజేపీతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. మోడీ సాహసోపేత నిర్ణయాల వల్ల అన్ని రంగాల్లో దేశానికి గుర్తింపు లభించిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి మరోసారి పట్టం కట్టారన్నారు.

ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీంగా మారిపోవడానికి ప్రధాన కారణంగా రాష్ట్ర నాయకత్వమేనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేయనుంది. పైగా, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తప్పవనే సంకేతాలను కూడా పంపుతోంది. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ నుంచి ఆయన తిరిగి వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :