బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (15:57 IST)

కలిసి పోరాడదాం, ఉక్కును కాపాడుకుందాం: జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలో విజయసాయి రెడ్డి

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పోరాట కమిటీ సోమవారం ఇక్కడ జంతర్‌ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీలందరితోపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1960 దశకంలో ఏళ్ళతరబడి సాగించిన పోరాటాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను సాధించారు.

ఈ సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించిన టి.అమతృతావు 1966లో 21 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగానికి పాల్పడ్డారు. ఈరోజు అమృతరావు శత జయంతి సందర్భంగా మనమంతా ఆయన పోరాటాన్ని, ఆత్మబలిదానాన్ని మననం చేసుకోవలసిన అవసరం ఉందని అన్నారు.
 
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోరాటంలో ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, ఆంధ్రా యూనివర్శిటీ, ఏవీఎన్‌ కాలేజీ విద్యార్ధులతోపాటు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కళాశాలల విద్యార్ధులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాలయాల విద్యార్ధులు కూడా పాలుపంచుకున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు.

పోరాటం ఉధృతరూపం దాల్చి 1966 నవంబర్‌ 1న విశాఖపట్నం ఓల్డ్‌ టౌన్‌ ప్రాంతంలోని పాత పోస్టాఫీసు వద్ద జరిగిన ఆందోళనపై పోలీసులు తుపాకులతో విరుచుకుపడి జరిపిన కాల్పుల్లో 32 మంది ఉద్యమకారులు ప్రాణాలు విడిచారు. వారి ఆత్మత్యాగాల కారణంగానే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా 1970 ఏప్రిల్‌ 17 అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు.
 
అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం 22 వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం స్వీకారం చుట్టింది. దాదాపు 68 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని విజయసాయి రెడ్డి చెప్పారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) పేరిట 1982 ఫిబ్రవరిలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అంకురార్పణ జరిగింది.

1991లో ఉత్పాదన ప్రారంభించింది. 15 వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 17 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, 70 వేల మంది పరోక్ష సిబ్బందితో రాష్ట్రంలో ఏర్పడిన అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు. ఇటీవల కోవిడ్‌ మహమ్మారి దేశ వ్యాప్తంగా సృష్టించిన మత్యుఘోష నేపథ్యంలో వేలాది టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను రైలు ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించి లక్షలాది మంది కరోనా బాధితుల ప్రాణాలను కాపాడింది విశాఖ ఉక్కు కర్మాగారం. క్లిష్ష సమయంలో జాతికి అంత మహత్తరమైన సేవలు అందించిన ఈ సంస్థను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆశనిపాతం అని విజయసాయి రెడ్డి అన్నారు.
 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర పావులు కదుపుతున్నట్లుగా తెలిసిన వెంటనే గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా ఉక్కు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ప్రైవేటీకరణకు బదలుగా స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. విశాఖ ఉక్కు ప్రైవేటకరణకు బదులుగా దానిని తిరిగి లాభాల బాటలో పెట్టడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు.
 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా ఇనప ఖనిజం, బొగ్గు గనులు లేవు. ఫలితంగా బాలదిల్లలోని ఎన్‌ఎండీసీ గనుల నుంచి మార్కెట్‌ రేట్‌కు ఇనుప ఖనిజం కొనుగోలు చేయవలసి వస్తోంది. కాబట్టి సొంతంగా గనులు కేటాయించాలి. అలాగే విశాఖ ఉక్కుపై 22 వేల కోట్ల రూపాయల రుణ భారం ఉంది. 14 శాతం వడ్డీ రేటుతో పొందిన ఈ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకు మార్చి వడ్డీ చెల్లింపులపై 2 ఏళ్ళపాటు మారటోరియం విధించాలని శ్రీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
 
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా ఉక్కు కార్మిక సంఘాలు జరిపే పోరాటంలో మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ఉమ్మడిగా పోరాటం చేయడానికి తాము ముందు నిలబడతామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ళ పోరాటలు, అనేక మంది ఆత్మబలిదానాలు, వేలాది మంది భూముల త్యాగాలతో అవతరించిన సంపద విశాఖ ఉక్కు. ఈ సంపదను కేంద్ర ప్రభుత్వం విక్రయించుకుంటే భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది. కాబట్టి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సమష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నందున కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు.